వియత్నాం టూర్‌‌కు 32 మంది టీచర్లు..అక్టోబర్ 10 నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్‌‌పోజర్ విజిట్ 

వియత్నాం టూర్‌‌కు 32 మంది టీచర్లు..అక్టోబర్ 10 నుంచి ఇంటర్నేషనల్ ఎక్స్‌‌పోజర్ విజిట్ 

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ఉత్తమ విద్యా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి చెందిన 32 మంది టీచర్లు, హెడ్మాస్టర్లు వియత్నాం పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్10 నుంచి 17వ తేదీ వరకు ఈ విదేశీ విద్యా పర్యటన కొనసాగనుంది. టీచర్స్ ఎక్స్​పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా వివిధ జిల్లాల నుంచి ఎంపిక చేసిన 32 మంది టీచర్ల తుది జాబితాను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు.

జిల్లా కలెక్టర్లు, డీఈవోల నుంచి అందిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి టీచర్ల జాబితాను ఖరారు చేసింది. మొత్తం ఎంపికైన 32 మందిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు అత్యధికంగా13 మంది ఉండగా, స్కూల్ అసిస్టెంట్లు 10 మంది ఉన్నారు. వీరితో పాటు జీహెచ్‌‌ఎంలు, ప్రిన్సిపాల్స్ మరో 9 మందికి ఈ విదేశీ అధ్యయన పర్యటన బృందంలో చోటు దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను మన బడుల్లో అమలు చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, టీచర్లతో కూడిన మొత్తం 40 మంది ప్రతినిధులను విదేశీ పర్యటనలకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 8 మంది అధికారుల పేర్లనూ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. కాగా, ఫిన్‌‌లాండ్, సింగపూర్, జపాన్, వియత్నాం దేశాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎంపికైన టీచర్లు అక్టోబర్10 నాటికి విదేశీ పర్యటనకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.