గుజరాత్ తీరంలో..3,300 కిలోల డ్రగ్స్ సీజ్

గుజరాత్ తీరంలో..3,300 కిలోల డ్రగ్స్ సీజ్
  •     విలువ సుమారు రూ.2వేల కోట్లు
  •     ఐదుగురు విదేశీయులు అరెస్ట్
  •     ప్యాకెట్లపై పాకిస్తానీ కంపెనీ పేరు
  •     ఎన్​సీబీ అధికారుల దర్యాప్తు 

గుజరాత్ తీరంలో అధికారులు 3,300 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్​లో రూ.1,300 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 

పోరుబందర్/న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్​సీబీ), నేవీ అధికారులు, గుజరాత్ పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్​లో భారీగా డ్రగ్స్ దొరికింది. 3,300 కిలోలు ఉన్న ఈ డ్రగ్స్ విలువ.. బహిరంగ మార్కెట్​లో రూ.2,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ పడవ ఇరాన్​లోని చాబహార్ పోర్టు నుంచి వచ్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. 

డ్రగ్స్ ప్యాకెట్లపై ‘రాస్ అవద్ గూడ్స్ కంపెనీ, ప్రొడ్యూస్ ఆఫ్ పాకిస్తాన్’ అని రాసి ఉందని ఎన్​సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎన్​సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్​ఎన్ ప్రధాన్ మీడియాకు వెల్లడించారు. ‘‘మంగళవారం ఉదయం ఇండియన్ కోస్టల్ ఏరియాలోకి ఓ అనుమానాస్పద నౌక ప్రవేశించింది. వెంటనే నేవీ అధికారులు అప్రమత్తమై.. సముద్ర నిఘా విమానం, యుద్ధ నౌక, హెలికాప్టర్లు నౌకను చుట్టుముట్టాయి. బోట్​ను పరిశీలించగా 3,300 కిలోల డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. వీటిలో 3,089 కేజీల చరాస్‌‌‌‌, 158 కేజీల మెథామెఫ్తమైన్‌‌‌‌, 25 కేజీల మార్ఫిన్‌‌‌‌ ఉన్నాయి. ఐదుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నాం’’ అని వెల్లడించారు. 

శాటిలైట్ ఫోన్, నాలుగు సెల్​ఫోన్లు సీజ్

ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎప్పుడూ పట్టుబడలేదని ఎన్​సీబీ డీజీ ప్రధాన్ తెలిపారు. 2023, మేలో కేరళ తీరంలో ఒకేసారి 2,500 కిలోల డ్రగ్స్​ను పట్టుకున్నట్లు గుర్తుచేశారు. స్మగ్లర్లు, డ్రగ్స్ ఆపరేటర్లు అరేబియా సముద్రంలోని ఇండియా జలాల ద్వారా డ్రగ్స్ ట్రాన్స్​పోర్ట్ చేస్తున్నారని తెలిపారు. ఫిషింగ్ బోటును పోరుబందర్​కు తరలించామన్నారు. అరెస్ట్ చేసిన వారు పాకిస్తాన్ లేదా ఇరాన్​కు చెందినవారై ఉంటారని తెలిపారు. శాటిలైట్ ఫోన్, నాలుగు సెల్​ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు.