ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం బడ్జెట్​లో రూ.7,740 కోట్లు కేటాయించామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ నెలాఖరు వరకు స్కీమ్ గైడ్ లైన్స్ ఖరారు చేస్తామన్నారు. ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు అందజేశారని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. ‘‘మా ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. రాష్ట్రంలో అవసరమైన వారందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని చేసిన వాగ్ధానాన్ని గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. 

బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన విషయాలు విని రాష్ట్ర ప్రజలు డబుల్ బెడ్ రూం ఇండ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పొందిన నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయింది’’అని భట్టి అన్నారు. అయితే, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు బడ్జెట్​లో నిధులు కేటాయించలేదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటికి సుమారు రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62 వేల డబుల్ ఇండ్లు స్టార్ట్ కాలేదు. లబ్ధిదారుల పేర్లు పంపని కారణంగా పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రాలేవు.

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాగా లేని వారికి జాగా ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. బడ్జెట్ లో రూ.7,740 కోట్లు కేటాయించటం అభినందనీయమన్నారు. ఈనెలాఖరు కల్లా గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని చెప్పారు. గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు.