సీఎస్​ సోమేశ్​ కుమార్​పై 365 ధిక్కరణ కేసులు

సీఎస్​ సోమేశ్​ కుమార్​పై 365 ధిక్కరణ కేసులు
  • సీఎస్​ సోమేశ్​ కుమార్​పై 365 ధిక్కరణ కేసులు
  • విచారణ జరపాలంటూ సీజేఐ జస్టిస్​ 
  • ఎన్వీ రమణకు ఎమ్మెల్యే రఘునందన్​ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్​పై 365 కోర్టు ధిక్కారణ కేసులుపెండింగ్​లో ఉన్నాయని,  వెంటనే వీటిని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ఏపీకి అలాట్ అయిన సోమేశ్ కుమార్ అక్రమంగా తెలంగాణలో ఉద్యోగం చేస్తూ, ఇక్కడి ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న సోమేశ్ కుమార్​పై చర్యలు తీసుకోవాల్సిందేనని కోరారు. ఆయనపై 2017లో అఖిల భారత ప్రభుత్వ ప్రతినిధులు వేసిన రిట్ పిటిషన్ ఇప్పటి వరకు ఎందుకు ఆగిందో తేల్చాలని విన్నవించారు. ఈ నెల 24న ఈ కేసు బెంచ్ ముందుకు రానుందని, ఆ రోజైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపై తీర్పు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణకు ఎమ్మెల్యే రఘునందన్ లేఖ రాశారు. తర్వాత ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాకు లేఖను విడుదల చేసి, మాట్లాడారు. సీఎస్  కేసును బెంచ్ మీదకు రాకుండా ఎవరు తొక్కిపెడుతున్నారో హైకోర్టు చీఫ్ జస్టిస్  తేల్చాలన్నారు. నిబంధనల ప్రకారం ఏపీకి కేటాయించిన సోమేశ్​కుమార్ అక్రమంగా తెలంగాణలో ఎలా పనిచేస్తున్నారని  అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనను ఏపీకి బదిలీ చేయాలన్నారు. ఆకునూరు మురళి వంటి ఎందరో సిన్సియర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ సర్కార్ సరైన పోస్టింగ్​లు ఇవ్వకపోవడంతో మురళి ఉద్యోగానికి రాజీనామా చేశారని  తెలిపారు. తప్పుడు పనులు చేస్తున్న తెలంగాణ సీఎస్​పై చర్యలు తీసుకోవాలన్నారు. సోమేశ్​ కుమార్ తమ ఫోన్లకే స్పందించరని మంత్రులే చెబుతున్నారన్నారు. న్యాయస్థానం ముందు అందరూ సమానమేనని, విచారణ నుంచి సీఎస్ తప్పించుకోలేరన్నారు. న్యాయస్థానంలో  సోమేశ్​కుమార్​పై పోరాడుతూనే.. ప్రజల్లో ఆయనను దోషిగా నిలబెడతానన్నారు.