వెయ్యి కోట్లతో 3,677 కొత్త బస్సులు

వెయ్యి కోట్లతో 3,677 కొత్త బస్సులు

కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం
చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేలు
కేబినెట్ భేటీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు

అమరావతి, వెలుగు: ఆర్టీసీ బలోపేతానికి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పాడయిపోయిన బస్సుల స్థానంలో 3,677 బస్సులు కొనాలని తీర్మానించింది. దీనికోసం రూ. 1,000 కోట్లు టర్మ్ లోన్ తీసుకునేందుకు కేబినెట్ ఆమోదించింది. బుధవారం అమరావతిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత కార్మికులకు రూ.24 వేల సాయం, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం రూ10 వేలకు పెంపు, తదితర కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని వివరాలు మీడియాకు వెల్లడించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందే 3 దశల్లో కొత్త బస్సులు కొనడం పూర్తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పేరుతో డిసెంబర్ 21 న కొత్త పథకం ప్రారంభిచనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏటా రూ. 24 వేల ఆర్థిక సాయం అందించనుంది.

లాయర్లకు నెలకు రూ.5 వేలు

లా కోర్సులు పూర్తి చేసి కొత్తగా ప్రాక్టీసు ప్రారంభించే జూనియర్ లాయర్లకు ఏపీ ప్రభుత్వం నెలకు రూ. 5 వేల స్టైఫండ్ అందించాలని నిర్ణయించిందని, బార్ అసోసియేషన్లో నమోదైన 3 ఏళ్లలోపు ఉన్న జూనియర్ లాయర్లకు ఈ ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు మంత్రి నాని తెలిపారు. హోంగార్డుల జీతాలను నెలకు రూ.18 వేల నుంచి రూ.21,300లకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ. 1,000 నుంచి రూ.3 వేలకు పెంపు, ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో బోర్వెల్స్ ఏర్పాటు. రూ. 200 కోట్లతో డ్రిల్లింగ్ మెషిన్ల కొనుగోలు, పౌరసరఫరాల సంస్థ రుణ పరిమితి రూ. 2 వేల కోట్లకు పెంపు నిర్ణయాలను కేబినెట్ ఆమోదించినట్లు పేర్కొన్నారు.