హైదరాబాద్‌సిటీ, వెలుగు: కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఖానాపూర్ క్యాంపస్ వద్ద 3.95 ఎకరాల భూమిని మెట్రో వాటర్ బోర్డుకు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కంపెనీలు, భారీ హైరైజ్ భవనాలతో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుండడం వల్ల భవిష్యత్తులో నీటి వినియోగం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీ రిజర్వాయర్ నిర్మించాలని వాటర్ బోర్డు నిర్ణయించింది.
ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 592 మీటర్ల ఎత్తులో ఉండడంతో, పంపింగ్ అవసరం లేకుండానే కేవలం గ్రావిటీ ద్వారా పరిసర ప్రాంతాలకు, బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి నీటిని సరఫరా చేసే వీలుంటుంది. దీనివల్ల విద్యుత్ ఖర్చులు భారీగా ఆదా అవ్వడమే కాకుండా, నియోపోలీస్, కోకాపేటతో పాటు పాతబస్తీ, షేక్‌పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం వంటి ప్రాంతాలకు నిరంతరాయంగా నీటి సరఫరా అందుతుంది.
ప్రస్తుతం ఇక్కడ సంప్, పంప్‌హౌస్, సెక్షన్ ఆఫీస్, గ్రౌండ్లెవెల్సర్వీసు రిజర్వాయర్, ఎస్టీపీ నిర్మాణ పనులు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఇందుకోసం కోకాపేట్ ప్రాంతంలో వాటర్‌బోర్డుకు ఉన్న భూమిని పూర్తిగా వినియోగించినప్పటికీ మౌలిక సదుపాయాల విస్తరణ దృష్ట్యా అదనపు భూమి అవసరం ఏర్పడింది. దీంతో అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయగా, అంగీకరిస్తూ భూమిని కేటాయించింది.
