ఆంధ్రప్రదేశ్: కాబోయే భర్త వేధింపుల తట్టుకోలేక కడప జిల్లాకు చెందిన రెహానా (26) అనే యువతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. 12 పేజీల సూసైడ్ నోట్ రాసి రెహానా ప్రాణాలు తీసుకుంది. ఈ సూసైడ్ నోట్ ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నువ్వంటే ఇష్టం లేదని.. ఫీలింగ్స్ రావట్లేదని.. తనకు నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని కాబోయే భర్త షాజహన్ వేధించడంతోనే తాను చనిపోతున్నట్లు రెహానా పేర్కొంది. మొదట్లో షాజహన్ మాటలను లైట్ తీసుకున్నానని.. కానీ పదే పదే నువ్వు అందంగా లేవు, ఫీలింగ్స్ రావడంలేదని టార్చర్ చేశాడని వాపోయింది.
నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదని.. తన కుటుంబ సభ్యులు బలవంతంగా చేస్తున్నారని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని షాజహన్ తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని సూసైడ్ నోట్లో రెహానా పేర్కొంది. తనకు మద్యం అలవాటు కూడా ఉందంటూ వివిధ రకాలుగా వేధించాడని తెలిపింది. రోజురోజుకు షాజహన్ వేధింపులు ఎక్కువై పోతుండటంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని రెహానా సూసైడ్ నోట్లో పేర్కొంది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన రెహానా (26)కు బెంగళూరులో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న షాజహాన్‌తో 2026, ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. 2026 ఆగస్ట్‌లో పెళ్లి కావాల్సి ఉంది. కానీ తనకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో కాబోయే భార్య రెహానాను వేధింపులకు గురి చేశాడు షాజహన్. తనకు నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని.. నువ్వు అందంగా లేవని.. నిన్ను చూస్తే ఫీలింగ్స్ రావట్లేదని వేధించాడు.
కాబోయే భర్త వేధింపులు తట్టుకోలేక కుమిలిపోయిన రెహానా మూడు రోజుల క్రితం ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. మరో రెండు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు పాడె ఎక్కడంతో రెహానా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని షాజహన్ను అరెస్ట్ చేశారు.

