
- ఢిల్లీని ముంచెత్తిన వాన..
- చెట్టు కూలి ఇంటిపై పడడంతో నలుగురు మృతి
- యూపీలో పిడుగుపాటుకు మరో ముగ్గురు దుర్మరణం
- పలు సిటీల్లో రోడ్లు జలమయం.. జనజీవనం అస్తవ్యస్తం
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వానకు గాలిదుమారం కూడా తోడవటంతో నజఫ్‌గఢ్‌లోని ఖర్ఖరి నహర్ గ్రామంలో వేప చెట్టు కూలి.. పక్కనే ఉన్న ఓ ఇంటిపై పడింది. దీంతో ఆ ఇంట్లోని ఐదుగురు కుటుంబసభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. శిథిలాల కింది నుంచి బాధితులను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే నలుగురు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అలాగే..ద్వారకాలోని ఛవ్లా ప్రాంతంలో గోడ కూలడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
నాలుగు గంటల్లో 98 ఎమర్జెన్సీ కాల్స్
భారీ వర్షం, గాలుల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో మూడు విమానాలను దారి మళ్లించారు. 200కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. రోడ్లపై నీరు నిల్వడంతో ఎక్కడికక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ఇండ్లు, వాటి పైకప్పులు, చెట్లు కూలడంపై ఉదయం 5 నుంచి 9 గంటల వరకు నాలుగు గంటల్లోనే 98 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఢిల్లీతోపాటు యూపీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలోనూ భారీ వర్షాలు కురిశాయి.
ఉత్తరప్రదేశ్‌లో పిడుగుల కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఫిరోజాబాద్‌లో ఉపాధి హామీ కింద పనిచేస్తున్న ఇద్దరు కూలీలు, ఈథా జిల్లాలో వర్షం నుంచి పంటలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబం పిడుగుపాటుకు గురైంది. గురుగ్రామ్, ఫరీదాబాద్, మథుర, ఘజియాబాద్ వంటి సిటీల్లో రోడ్లపై నీరు నిలిచి, భారీ ట్రాఫిక్ ఏర్పడింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వడగండ్లు, ఉరుములతో కూడిన వర్షాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లను జారీ చేసింది.