రాష్ట్రంలో కొత్తగా 4 డీ-అడిక్షన్ సెంటర్లు.. ఈ నాలుగు జిల్లాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు

రాష్ట్రంలో కొత్తగా  4 డీ-అడిక్షన్ సెంటర్లు.. ఈ నాలుగు జిల్లాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • రంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ, మేడ్చల్ జిల్లాల్లో ఏర్పాటు చేసే యోచన
  • ప్రభుత్వానికి ప్రతిపాదించిన అధికారులు
  • సాధ్యాసాధ్యాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న సర్కార్​
  • రంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ, మేడ్చల్
  • జిల్లాల్లో ఏర్పాటు చేసే యోచన
  • సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​గా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, మద్యం వ్యసనాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు పోలీసులు, ఎక్సైజ్, ఈగల్ టీమ్స్ ద్వారా మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతూనే.. మరోవైపు బాధితులకు మెరుగైన చికిత్స అందించి, ఆ వ్యసనం నుంచి బయట పడేలా చేయాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీనిపై చర్చించి త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

నాలుగు జిల్లాల్లో కొత్త సెంటర్లు

ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు ఏయే జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయో తెలుసుకున్న అధికారులు.. నాలుగు జిల్లాలను ప్రైమరీగా గుర్తించారు. రంగారెడ్డి, వికారాబాద్, హనుమకొండ, మేడ్చల్  జిల్లాల్లో  డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లోని హాస్పిటల్, మేడ్చల్ జిల్లా హాస్పిటల్, హనుమకొండ జిల్లా పరకాల ఏరియా హాస్పిటల్, వికారాబాద్ జిల్లా తాండూరులోని హాస్పిటల్ లో ఈ కొత్త డీ-అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన రివ్యూ మీటింగ్ లో అధికారులు డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు ఆవశ్యకతను మంత్రికి వివరించారు. అయితే, దీనిపై మరిన్ని చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే ఈ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సెంటర్లలో వ్యసనపరులకు అవసరమైన మందులతోపాటు, సైకలాజికల్ కౌన్సెలింగ్, రిహాబిలిటేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి.

ఎర్రగడ్డపై పెరుగుతున్న భారం

రాష్ట్రంలో ఏ మూలన వ్యసనపరులు తీవ్ర అనారోగ్యానికి గురైనా వారిని హైదరాబాద్‌‌ లోని ఎర్రగడ్డ మానసిక దవాఖానాకు తరలిస్తుంటారు. దీంతో హాస్పిటల్ పై తీవ్ర భారం పడుతున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి రోగులు వస్తుండడంతో వారికి సరిపడా సేవలు అందించడం సిబ్బందికి కష్టంగా మారింది. గత సెప్టెంబర్ నెలలో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు 609 కేసులు వచ్చాయి. ఇందులో ఆల్కహాల్ 237, నికోటిన్ 235, గంజాయి 25, కొకైన్ 1, ఇంజక్షన్స్ 2.. మిగతావి ఫాలోఅప్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డపై భారాన్ని తగ్గించి, స్థానికంగానే చికిత్స అందించాలని ప్రభుత్వానికి అధికారులు సూచించారు. 

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌గా ఎర్రగడ్డ

ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ను 1895 నిజాం కాలంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి మానసిక సమస్యలు ఉన్నవారికి వైద్యం అందించడంలో ఈ హాస్పిటల్​ కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ డీఅడిక్షన్ సెంటర్ ను ప్రభుత్వం డెవలప్ చేయాలని నిర్ణయించింది. సేవలను విస్తరించడంతోపాటు, రిహాబిలిటేషన్, ఒకేషనల్ చికిత్స అందించేలా డెవలప్ చేయాలని నిర్ణయించింది. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే నాలుగు కొత్త డీ అడిక్షన్ సెంటర్లకు ఎర్రగడ్డ హాస్పిటల్ ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా డెవలప్ చేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే టీచింగ్ హాస్పిటల్స్ లో డీ-అడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయి.