
- ఈ నెల 27 నుంచి మహాలక్ష్మి స్కీమ్ అమలు
- ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికే సబ్సిడీ
- గత మూడేండ్ల సగటు తీసి సిలిండర్ల కేటాయింపు
- గైడ్‌లైన్స్ రూపొందించిన సివిల్ సప్లయ్స్ అధికారులు
హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఈ నెల 27 నుంచి ఐదొందల రూపాయలకే గ్యాస్ అందజేసే పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు సేకరించింది. అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.
వీరందరికీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా సబ్సిడీ సిలిండర్లను అందించనున్నారు. సివిల్ సప్లయ్స్ అధికారులు ఈ స్కీమ్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించారు. ప్రజా పాలన దరఖాస్తులు పరిశీలించి వాటికి ఆధార్, రేషన్ కార్డులతో సింక్ చేశారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేని వాటిని పక్కనపెట్టేశారు. లబ్ధిదారులు మూడేండ్లలో ఏడాదికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారో తెలుసుకున్నారు. ఆ డేటా ప్రకారమే సబ్సిడీ అందించనున్నారు.
గ్యాస్ సబ్సిడీ స్కీమ్ మార్గదర్శకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహార భద్రత కార్డులున్న (రేషన్ కార్డులు) వారు ఈ స్కీమ్‌కు అర్హులుగా తేల్చారు. ప్రజా పాలనలో తప్పనిసరిగా గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుని ఉండాలనే నిబంధన విధించారు. సిలిండర్‌ల కేటాయింపు అనేది.. గడిచిన మూడేండ్లుగా లబ్ధిదారులు సగటున ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారనే ఆధారంగా అందజేయనున్నారు.
ఇప్పటి వరకు గుర్తించిన దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలు చేయనున్నారు. సిలిండర్ డెలివరీ సమయంలోనే లబ్ధిదారులు పూర్తిగా ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీల నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా సబ్సిడీ మొత్తం అర్హులైన లబ్ధిదారులకు బదిలీ చేస్తాయి. గ్యాస్ కనెక్షన్‌కు లింక్ అయి ఉన్న అకౌంట్‌లో నగదు బదిలీ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల కోసం ఎల్‌పీజీ కంపెనీలకు నెలవారీ ప్రాతిపదికన ముందస్తుగా అడ్వాన్స్ రూపంలో అందిస్తుంది.