పెరుగుతున్న ఎండలు.. మూడు రోజుల్లో మరో 3 డిగ్రీలు పెరిగే చాన్స్

పెరుగుతున్న ఎండలు.. మూడు రోజుల్లో మరో 3 డిగ్రీలు పెరిగే చాన్స్
  • సూర్యాపేట జిల్లాలో 42.6 డిగ్రీల టెంపరేచర్​
  • అన్ని జిల్లాల్లో అధికమైన ఉక్కపోతలు

హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల కిందటి వరకు కాస్తంత తక్కువగా ఉన్న ఎండలు.. మళ్లీ దంచేస్తున్నాయి. మంగళవారం పలు చోట్ల వర్షాలు పడినా.. ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కుగానే నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత కూడా పెరిగింది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదైంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా కీతవారిగూడెంలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 42.5, మంచిర్యాల జిల్లా కొమ్మెర, కొండాపూర్​లలో 42.4, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 42.2, పెద్దపల్లి జిల్లా ముత్తారం, మంచిర్యాల కవ్వాల్ టైగర్ రిజర్వ్​లో 42, కరీంనగర్​ వీణవంక, నల్గొండ జిల్లా కట్టంగూర్, మంచిర్యాల జన్నారంలలో 41.9 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉక్కపోత సాధారణం కన్నా ఎక్కువగా నమోదైంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో హ్యుమిడిటీ 100 శాతంగా రికార్డయింది. రాబోయే మూడు రోజుల పాటు టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. 

అక్కడక్కడా వానలు పడ్డయ్

రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కూడా పడ్డాయి. వికారాబాద్​ జిల్లా కోటేపల్లిలో 4.23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జయశంకర్​ జిల్లా కాటారంలో 3.9, నల్గొండ జిల్లా మర్రిగూడలో 3.1, కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో 2.9, జగిత్యాల జిల్లా కథలాపూర్​లో 2.5, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 2.5, సంగారెడ్డి జిల్లా కందిలో 2.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లిలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం నుంచి రాష్ట్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.