గ్రామ పంచాయతీలకు..రూ.వెయ్యి కోట్లు పెండింగ్

గ్రామ పంచాయతీలకు..రూ.వెయ్యి కోట్లు పెండింగ్
  • మూడు నెలలుగా జనరల్ ఫండ్స్రూ.777 కోట్లు ఇయ్యలె
  • పెండింగ్ బిల్లులురూ.200 కోట్లు క్లియర్ చేయలె
  • రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల చెక్కులు, బిల్లులు నిలిపివేత
  • కార్మికుల జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐలు, కరెంట్ బిల్లుల కోసం సర్పంచ్​ల అవస్థలు

హైదరాబాద్, వెలుగు: ఏడాదిగా గ్రామ పంచాయతీల బిల్లులు పెండింగ్​లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. మూడు నెలలుగా నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చే జనరల్ ఫండ్​ నిధులు కూడా రిలీజ్ చేయడం లేదు. ఇలా జీపీలకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్​ల నిర్వహణ ఖర్చుల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.259 కోట్లు విడుదల చేసేది. పల్లె ప్రగతి కోసం కొన్నాళ్లు ఇచ్చి.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆపేశారు. ఈ నిధులు రూ.777 కోట్లు కాగా, చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు మరో రూ.200 కోట్లు ఉన్నాయి. ఇప్పుటికే బిల్లులు క్లియర్ కాక ఇబ్బందులు పడుతున్న సర్పంచ్​ల పరిస్థితి.. జనరల్ ఫండ్ నిధులు కూడా ఆగిపోవడంతో పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లైంది. 

మూకుమ్మడి రాజీనామాల వరకు 

పెండింగ్​బిల్లుల క్లియరెన్స్ కోసం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్​లు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న టైమ్​లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమస్య ఇబ్బందిగా మారింది. దీంతో నెల రోజుల కింద పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేస్తామని సీఎం అన్నారు. మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఫైనాన్స్, పంచాయతీ రాజ్ అధికారులను బిల్లులు విడుదల చేయాలని చెప్పారు. అయితే మొత్తం బిల్లులు క్లియర్ చేయలేదు. కేవలం కొన్ని గ్రామ పంచాయతీలకు మాత్రమే నిధులు విడుదలు ఇచ్చారు. ఇప్పటికీ చాలా గ్రామాల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇవి రోజురోజుకు పెరుగుతున్నాయి.

మరో ఏడు నెలల్లో టర్మ్ పూర్తి 

రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల బిల్లులు, చెక్కులు పెండింగ్ లో ఉన్నట్లు పంచాయతీ రాజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ బిల్లుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంది. ఈ బిల్లులు రాక పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు 2, 3 నెలలకు ఒకసారి జీతాలు చెల్లిస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. ట్రాక్టర్ల ఈఎంఐ, కరెంట్ బిల్లులు ఇతర ఖర్చుల కోసం సర్పంచ్​లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీల టర్మ్ మరో ఏడు నెలల్లో పూర్తి కానుండడంతో వారిలో ఆందోళన పెరుగుతున్నది.

కేంద్రం ఇచ్చే నిధుల దారిమళ్లింపు

ఈ ఏడాది మార్చి 31న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.707 కోట్లు విడుదలయ్యాయి. అయితే వీటిని లోకల్ బాడీలకు రిలీజ్ చేయకుండా రాష్ట్ర సర్కార్ ఇతర స్కీమ్ లకు మళ్లించింది. ఇక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.600 కోట్లు సైతం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ డబ్బులు  రిలీజ్​చేయలేదు. 

బిల్లులు క్లియర్ కాలేదు 

బిల్లులు విడుదల చేశామని మంత్రులు చెప్పినవన్నీ అబద్ధాలు. జీపీలకు జనరల్ ఫండ్ అకౌంట్, ఎస్ఎఫ్ సీ, 15వ ఆర్థిక సంఘం.. మూడు అకౌంట్లు ఉంటాయి. బిల్లులు విడుదల చేస్తే ఈ మూడు ఖాతాల్లో ఒక్క దాంట్లో అయిన కనపడాలి కదా.. ఎక్కడ బిల్లులు విడుదల చేశారో ప్రభుత్వమే చెప్పాలి. మంత్రుల ప్రకటనలు, మీడియాలో చేసుకున్న ప్రచారంతో మాకు అప్పులు ఇచ్చిన వాళ్లు వచ్చి నిలదీస్తున్నరు. 

‑ శ్రీరాంరెడ్డి, సర్పంచ్, దామెర పంచాయతీ, పరకాల