నిరుపేదల కళ్లల్లో వెలుగులు .. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో 46 వేల కంటి ఆపరేషన్లు

నిరుపేదల కళ్లల్లో వెలుగులు .. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో 46 వేల కంటి ఆపరేషన్లు
  • ఉచితంగా కళ్లద్దాలు, మందుల పంపిణీ
  • రెండు దశాబ్దాలుగా సేవలు

ఆదిలాబాద్ ​టౌన్​, వెలుగు:  గ్రామాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్నవారి సమస్యలు పరిష్కరిస్తోంది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి. కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ హైదరాబాద్ లేదా ఇతర నగరాలకు వెళ్లి రూ.వేలు ఖర్చు చేయలేనివారికి అందగా నిలుస్తోంది. మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సమస్యలున్నవారికి ఉచితంగా చికిత్సలు చేసి వారికి వెలుగులు పంచుతోంది.

రెండు దశాబ్దాల క్రితం ప్రారంభం

ఆదిలాబాద్​కు చెందిన షేషన్న చెన్నావార్​అనే వ్యాపారవేత్త 2005 జూన్ 9న జిల్లా కేంద్రంలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఇక్కడికి జిల్లా వ్యాప్తంగానే కాకుండా పొరుగు జిల్లాలు, పక్క రాష్ట్రాల ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. ప్రస్తుతం మొత్తం 32 పడకలతో ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఏటా సేవలను విస్తరిస్తూ.. ప్రస్తుతం అన్ని మండల కేంద్రాల్లో కంటి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఊరూరా శిబిరాలు నిర్వహించి, చికిత్సలు అవసరమైన వారిని వాహనాల్లో ఆదిలాబాద్​కు తీసుకొచ్చి ఫ్రీగా ఆపరేషన్లు చేస్తున్నారు. 

ఫెకో, మధుమేహ వ్యాధిగ్రస్థులకు అవసరమైన లేజర్​ చికిత్సలను అందిస్తున్నారు. హైదరాబాద్​ నుంచి నిపుణులను రప్పించి రెటీనా, గ్లూకోమా సమస్యలున్న వారికి చికిత్సలు చేస్తున్నారు. -పూర్తిగా అంధత్వం ఉన్నవారికి ట్రైనింగ్​ ఇస్తున్నారు. ఎలా పనులు చేసుకోవాలి, నగదును ఎలా గుర్తించాలి తదితర అంశాలపై ప్రతేక శిక్షణ ఇస్తున్నారు. కంటి చూపు తక్కువగా ఉన్న వారికి టెలీస్కోపింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. 

46,184 కంటి సర్జరీలు 

 రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ ఆస్పత్రి.. ప్రస్తుతం జిల్లాలోని బోథ్, జైనథ్, బేల, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, జన్నారం మండల కేంద్రాల్లో ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాల్లో ఉచిత కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు కొనలేని స్థితిలో ఉన్న వారికి ఉచితంగా అందిస్తోంది. పూర్తిగా అంధత్వం ఉన్నవారికి.. చనిపోయిన వారి కళ్లను కంటి మార్పిడి(కార్నియా ట్రాన్స్​ప్లాంట్) అమర్చుతున్నారు. ఆస్పత్రి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 46,184 కంటి సర్జరీలు చేశారు. అందులో 23,092 సర్జరీలను పూర్తిగా ఉచితంగా చేశారు. ప్రతి రోజు 150కి పైగా రోగులకు ఉచిత ఓపీడీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్​ఎఫ్​సీబీపీ ప్రాజెక్టు ప్రారంభించి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్​స్కూళ్లలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన కళ్ల అద్దాలను, మందులు 
అందజేస్తున్నారు.

అంధత్వ నివారణే లక్ష్యం

అంధత్వాన్ని నివారించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. జాతీయ అంధత్వ నియంత్రణ సంస్థ(ఎన్ సీఎస్), రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు సాగుతున్నాం. ప్రాథమిక నేత్ర వైద్యశాలలను జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి అనుసంధానించి సేవలందిస్తున్నాం. అవసరమున్న వారికి నేరుగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కార్నియా మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తాం. ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. 

టి.రంజిత్​కుమార్, అడ్మినిస్ట్రేటర్, ఎల్​వీ ప్రసాద్​ఆస్పత్రి, ఆదిలాబాద్​