గోదావరిఖని, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా ఉన్న 19 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఎండ వేడితో మండిపోతున్నాయి. బయట ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుండగా, ఓసీపీలలో 48 డిగ్రీల వరకు నమోదవుతోంది. ప్రాజెక్టుల వద్ద ఉద్యోగులకు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను మేనేజ్‌మెంట్ అందిస్తోంది. క్వారీల్లో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం పందిళ్లు ఏర్పాటు చేసినప్పటికీ తుంగ కప్పకపోవడం, చుట్టూ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డంపర్లు, డోజర్లు, ఆపరేటర్ల క్యాబిన్లలో ఏసీలు ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రతల వల్ల అవి సరిగా పనిచేయడం లేదని కార్మికులు చెబుతున్నారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల్లో ఉద్యోగుల పనివేళలు మార్చాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కె.రాజ్‌కుమార్, టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, వ్యవస్థాపక కన్వీనర్ కెంగర్ల మల్లయ్య మేనేజ్‌మెంట్‌ను డిమాండ్ చేశారు.
మంగళవారం జీడీకే ఓసీపీ–5 మేనేజర్ అనిల్ గబాలేకు ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను వినతిపత్రం అందజేశారు. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా మొదటి షిఫ్టును ఉదయం 7 గంటలకు బదులుగా 6 గంటలకు, రెండో షిఫ్టును మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా 4 గంటలకు ప్రారంభించాలని కోరారు.
