దీపావళి ఎఫెక్ట్: సరోజిని దేవి కంటి హాస్పిటల్‎కు క్యూ కట్టిన బాధితులు

దీపావళి ఎఫెక్ట్: సరోజిని దేవి కంటి హాస్పిటల్‎కు క్యూ కట్టిన బాధితులు

హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు: దీపావళి సందర్భంగా గురు, శుక్రవారాల్లో పటాకులు కాలుస్తూ 48 మంది గాయపడ్డారు. వీరంతా మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి హాస్పిటల్‎కు క్యూ కట్టారు. ఇందులో 45 మంది గ్రేటర్ నుంచి ఉండగా, ముగ్గురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు. పటాకులు కాల్చే టైంలో జాగ్రత్తలు పాటించకపోవడం, పిల్లలు కాల్చేప్పుడు పెద్దవాళ్లు గమనించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరిగాయి.

 వీరిలో 20 మంది చిన్నారులు, 28 మంది పెద్దవాళ్లు ఉన్నారు. 40 మందికి ట్రీట్​మెంట్ ఇచ్చి ఇంటికి పంపిన డాక్టర్లు, 8 మందికి కంటి సమస్య తీవ్రంగా ఉండటంతో అడ్మిట్​ చేసుకున్నారు. వీరికి ఆపరేషన్లు చేసేంత అవసరం లేదని, త్వరలోనే డిశ్చార్జ్​ చేస్తామని సూపరింటెండెంట్​చెప్పారు. ప్రైవేట్​హాస్పిటల్స్‎లో చేరిన వారి సంఖ్య  ఎక్కువగా ఉండొచ్చని అంచనా. 

గతేడాది 70 మంది.. 

గతేడాది దీపావళి నాడు సరోజినిదేవి హాస్పిటల్‎కు 70 మంది కంటి సమస్యలతో రాగా, 9 మందికి డాక్టర్లు ఆపరేషన్లు చేశారు. ఇద్దరు పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బాధితులు తగ్గారు. 48 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రజల్లో అవగాహన పెరగడం, జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదాల సంఖ్య తగ్గి ఉండవచ్చని డాక్టర్లు తెలిపారు. 

అవగాహన పెరిగింది 

దీపావళి టైంలో పటాకులు కాల్చేప్పుడు అజాగ్రత్తతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్‎లో ముందస్తు ఏర్పాట్లు చేశాం. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రమాదాల సంఖ్య తగ్గింది. ప్రజల్లో అవగాహన పెరగడం, జాగ్రత్తలు తీసుకోవడంతోనే ప్రమాదాలు తగ్గాయి.  

– డాక్టర్​ పి.మోదిని, సూపరింటెండెంట్, సరోజిని దేవి హాస్పిటల్

మళ్లీ జరగకుండా చూస్కుంటాం 

మా పాప పేరు శ్రీనిధి. ఆరేండ్లు. గురువారం రాత్రి క్రాకర్స్​కాలుస్తుంటే స్పార్క్స్ కండ్లల్లో పడ్డాయి. సరోజిని దేవి హాస్పిటల్‎కు తీసుకువచ్చాం. టెస్టులు చేసి ప్రమాదం లేదని చెప్పారు. త్వరలోనే డిశ్చార్జ్​చేస్తామన్నారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. 

– అనంతయ్య, కిస్మత్​పూర్

లక్ష్మీబాంబు కాలుస్తుంటే...

మా బాబు పేరు ప్రణీత్. 11 ఏండ్లు. గురువారం రాత్రి లక్ష్మీబాంబు కాలుస్తుండగా దగ్గరగా ఉండడంతో కండ్లలో నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే సరోజినికి తీసుకురాగా కండ్లను క్లీన్​చేశారు. ప్రమాదం తప్పింది.  

– జగదీష్​ బాబు, దుండిగల్​