
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 488 గ్రామాలకు రోడ్డే లేదు
వానొస్తే ఏ ఊరుకాఊరు ఏకాకే. ఆ టైమ్‌ల పానం సుస్తైతే బతుకు గాల్లో దీపమే. రోడ్లు లేక ఊరు దాటి పోలేరు… వాగు పొంగితే బయిటి ప్రపంచంతో బంధాలు కట్టైనట్లే. వానకాలమొస్తే కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు సగం పల్లెల దుస్థితి ఇది. జిల్లాలో 1045 ఆవాసాలు ఉండగా 488 ఆవాసాలకు కనీసం రోడ్డు కూడా లేదు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద వాన కొడితే రోడ్లు లేక ఏ ఊరికి పోలేము. వాగులు, వంకలు పొంగితే ఎన్నో పల్లెల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోవాల్సిందే. ఈ టైమ్‌లో అనారోగ్యాలకు గురైతే ఆ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఊర్లకు రోడ్డు సౌలత్ లేక.. వాగులు, వంకలపై కల్వర్టులు లేక ఇక్కడి ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రతి వానకాలం వారి ఇబ్బందులు అన్నీ.. ఇన్నీ కావు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా మంచంపై కిలోమీటర్ల కొద్ది మోసుకుపోవాలిసన దయనీయ పరిస్థితి. జిల్లాలో మొత్తం 1025 అవాసలకు గాను 488 ఆవాసాలకు కనీసం మట్టి రోడ్డు కూడ లేకపోవడం ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాలో స్పష్టం చేస్తోంది. ఇప్పటికీ జిల్లాలో 82162 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉందని అధికారులే చెబుతున్నారు. జిల్లాలో 136 ప్రధాన బ్రిడ్జిలు కట్టాల్సి ఉంది. వీటి నిర్మాణానికి రూ.172 కోట్లు అవసరమని పంచాయతీరాజ్ శాఖ ప్లాన్ చేసింది. 488 గ్రామాలకు రోడ్లు ,కల్వర్టులు ,వంతెనల నిర్మాణంకు రూ.761.07 కోట్లు అవసరమని తెలిపింది. జిల్లా ప్రజలకు రోడ్డు సౌలత్ కలగాలంటే రూ.948.69 కోట్లు అవసరం.
ఈ చిత్రంలో చంటిబిడ్డతో వాగు దాటి వెళ్తున్న వీరు కుమ్రం భీమ్ జిల్లా కెరమెరి మండలం కార్పత్డ వాసులు. అంసు బాయి(చిత్రంలో ఎర్ర దుప్పటి కప్పుకున్న మహిళ) సోమవారం తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన గంట రెండు గంటల్లోనే ఆమె రెండు కిలోమీటర్లుకు పైగా నడిచి వెళ్లి 108లో కెరమెరి పీహెచ్ కి చేరుకుంది. అంసుబాయికి పురిటి నొప్పులు రాగానే 108కు ఫోన్ చేశారు. ఆమెను దవాఖానకు తీసుకొచ్చేందుకు వెళ్లిన వెహికిల్ ఊరికి రెండు కి.మీ. దూరంలోని రావూజీ గూడ దగ్గరే ఆగిపోయింది. 2014లో వర్షా లకు అక్కడి వాగు పొంగి బ్రిడ్జి కొట్టు కుపోయిం ది. ఇంత వరకు దాన్ని బాగుచేసిన వారు లేదు. బ్రిడ్జి లేక ఏ వెహికిల్ అంతకంటే ముందుకు వెళ్లలేదు. అంసుబాయి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో 108 సిబ్బందే నడుచుకుంటూ వెళ్లి ఆమెకు పురుడుపోశారు. అనంతరం ఇలా నడిపించుకుంటూ తీసుకొచ్చి దవాఖాన తీసుకుపోయిన్రు. అదృష్టం గా బాగుండడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. రోడ్డు సౌలత్ లేక ఆసిఫాబాద్ జిల్లా లో దాదాపు సగం పల్లెలు ఇలా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నరు.
నిధుల్లేక రోడ్లు వేయట్లేదు
జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్లు లేక ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాస్తవమే. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధుల కొరత కారణంగా పనులు చేయలేక పోతున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే రోడ్లు, వంతెనలు నిర్మాణ పనులు చేపడతాం. -వెంకట్రావు, పంచాయతీ రాజ్ ఈఈ, ఆసిఫాబాద్
అటవీ అనుమతుల రాక ఆలస్యం
ఆర్అండ్‌బీ పరిధిలోని మెయిన్ రోడ్లు బాగానే ఉన్నాయి. అవసరమున్న చోట రిపేర్లు చేయిస్తున్నాం. ఇటీవల కొన్ని రోడ్లు మంజూరయ్యాయి. అయితే అటవీ అనుమతులు రాక వాటి పనులు ఆలస్యం అవుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు రిపోర్టు ఇచ్చాం.
-రాములు నాయక్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్అండ్‌బీ, ఆసిఫాబాద్
అధికారులు పట్టించుకుంటలేరు
జిల్లాలో కనెక్టివిటీ చాలా దారుణంగా ఉంది. ట్రైబల్ ఏరియాలో.. ముఖ్యంగా ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌలత్ లేకపోవడం బాధాకరం. వానకాలం ప్రజల కష్టాలు చెప్పేలా లేవు. అన్ని విభాగాల అధికారులు ఈ విషయలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆదివాసీలకు సంబంధించి గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి. వాటిని వినియోగించి అయినా పరిస్థితిలో మార్పు తెచ్చేలా చర్యలు చేపట్టాలి.
– కొమురం మాంతయ్య, రాజ్ గోoడ్ సేవా సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు