
హైదరాబాద్, వెలుగు: వరదల కారణంగా తెలంగాణలో 49 మంది మరణించారని రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు నివేదించింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని వెల్లడించింది. ‘‘వరద సాయం కింద సీఎం కేసీఆర్ ఇప్పటికే రూ.500 కోట్లు ప్రకటించారు. 49 మందిలో జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో నలుగురు మరణించారు. అక్కడ వరద తీవ్రత ఎక్కువ ఉన్నందున రెండు హెలికాప్టర్లు, 27 పడవల్ని అందుబాటులో ఉంచాం.
655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 177 షెల్టర్లను ఏర్పాటు చేసి, సుమారు 12 వేల మందికి ఆశ్రయం కల్పించాం. పది ఎన్డీఆర్‌ఎస్ టీమ్స్, రెండు హెలికాప్టర్లు, రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుల శాఖలు వరద బాధితులకు అండగా నిలిచాయి. 548 రోడ్లు దెబ్బతింటే వీటిలో 471 రాష్ట్ర రహదారులు ఉన్నాయి. వీటిలో 181 రోడ్లకు మరమ్మతులు జరిగాయి. 774 గ్రామాల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది.
721 గ్రామాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేశాం. రోడ్ల రిపేర్లు, విద్యుత్ సరఫరా వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం’’అని హైకోర్టుకు రాష్ట్ర విపత్తుల కమిషనర్ బొజ్జా రాహుల్ తెలియజేశారు. వరదలపై చెరుకు సుధాకర్ దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాహుల్ సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు.