- 24,43,088 ఓట్లు డిజిటలైజ్ పూర్తి
మెదక్/ సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువు ముగియగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి పెద్ద సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు అన్ కలెక్టబుల్ జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నింటిలో కలిపి మొత్తం 29,03,543 ఓటర్లు ఉన్నారు. ఓటర్లందరికి బీఎల్ఓ ల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. 24,43,088 ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి తిరిగి రాగా, వాటిని డిజిటిలైజ్ చేశారు. 4,58,678 ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి రాలేదు.
అన్ కలెక్టబుల్ ఫారాల్లో అత్యధికంగా పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1,35,888 ఉండటం గమనార్హం. ఆ తర్వాత రెండో స్థానంలో నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 50,559 ఫారాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 18,722 మంది ఫారాలు ఇవ్వలేదు. వీరిలో 5,431 మంది మరణించిన వారు, 3,433 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నవారు, 8,948 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, 874 మంది ఆచూకీ లభించని వారు ఉన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో 24,214 మంది ఓటర్లను అన్‌కలెక్టబుల్‌గా గుర్తించారు. వీరిలో 7,735 మంది మరణించిన వారు, 3,414 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నవారు, 12,153 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు, 634 మంది ఆచూకీ లభించని వారు ఉన్నారు. ఈనెల 17వ తేదీన ప్రచురించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో డిజిటలైజ్ అయిన ఓటర్ల పేర్లు మాత్రమే ఉంటాయి.
మిగితా వారికి నోటీసులు జారీ చేస్తారు. అర్హులైన ఓటర్లు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే అధికారులు వాటిని విచారణ జరిపి సక్రమంగా ఉంటే ఓటర్ల ఫైనల్ లిస్ట్ లో జత చేసి ప్రచురిస్తారు. అవి పోను మిగితా ఓట్లన్నీ తొలగిస్తారు.
