విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పరీక్షల అక్రమాల్లో భాగమైన వ్యక్తులు లేదా ముఠాలకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 1 కోటి వరకు జరిమానా విధించేలా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన సమస్యను అరికట్టేందుకు త్వరలోనే పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు.
చట్టం పరిధిలోకి వచ్చే నేరాలన్నీ నాన్-బెయిలబుల్‌గా పరిగణించబడతాయి. అంటే నిందితులకు సులభంగా బెయిల్ లభించదు. పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే వారిపై కోటి రూపాయల ఫైన్‌తో పాటు, వారి ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంది.
ఈ చట్టం కేవలం అక్రమాలకు పాల్పడే ముఠాలు, లీకేజీ మాఫియాను శిక్షించడానికే కానీ .. అమాయక విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రక్షణ కల్పించారు.
మరోవైపు నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలకు నిరసనగా 'కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్ష రద్దు వల్ల నష్టపోయిన అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని, అలాగే విద్యార్థులకు మద్దతుగా నిలిచి అరెస్ట్ అయిన క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
