రాజమండ్రిలో కల్తీ పాలు తాగి...ఐదుగురి మృతి...!

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి...ఐదుగురి మృతి...!

రాజమండ్రిలో కల్తీ పాల ఘటన కలకలం రేపింది. కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి చెందగా..తీవ్ర అస్వస్తతకు గురైన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్యలు, డయేరియాతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కల్తీ పాలే కారణమని ప్రాధమికంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు అధికారులు. అస్వస్థతకు గురైనవారి ఇళ్లకు పాలు సప్లై చేసిన వ్యాపారి గణేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు అధికారులు.

ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. కలెక్టర్ కీర్తి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పాలు, నీళ్లు, పరిసరాలను పరిశీలించారు. పాల శాంపిల్స్ సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు అధికారులు. పాలు తాగినవారి శాంపిల్స్ తో పాటు పశువుల శాంపిల్స్ కూడా సేకరించి వైజాగ్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు అధికారులు. ఇప్పటివరకు నమోదైన మరణాలు పాల కల్తీ కారణంగానే అయ్యి ఉండచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మరణించిన వ్యక్తి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక స్పందిస్తామని తెలిపారు అధికారులు.కల్తీ పాల ప్రభావం చిన్నపిల్లలు, వృద్దులపైనే ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు.

ఈ ఘటనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారుల నుంచి సమాచారం సేకరించారు చంద్రబాబు.బాధితులకు అందుతున్న వైద్య సాయం గురించి సీఎంకు వివరించారు అధికారులు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు సీఎం చంద్రబాబు.