
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వర్షాల నేపథ్యంలో నాలాల్లో ఆటంకాలు తొలగించి వరద సాఫీగా వెళ్లేలా చూడాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వరదను తెచ్చే బుల్కాపూర్ నాలాలో చెత్త తొలగింపు పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా టోలీ చౌకీ సమీపంలోని విరాట్‌నగర్ వద్ద 100 మీటర్ల పరిధిలో 50 లారీల చెత్త బయటపడింది. దీన్ని వెంట వెంటనే అక్కడి నుంచి తరలించాలని కమిషనర్ ఆదేశించారు. శంకర్‌పల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి మొదలైన ఈ నాలా ఖానాపూర్, నాగులపల్లి దాటి ముందుగా గండిపేటను నింపుతుంది.
తర్వాత ఔటర్ రింగురోడ్డు దాటి.. నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, రాయదుర్గం, షేక్‌పేట, టోలీచౌక్‌లోని హకీంపేట, మెహిదీపట్నం, బంజారాహిల్స్ రోడ్డు నంబర్12, చింతలబస్తీ, తుమ్మలబస్తీ, ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా హుస్సేన్ సాగర్‌లో కలుస్తుంది. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ పరిధిలోని పద్మా కాలనీలో ఇటీవల కూలిపోయిన నాలా రిటైనింగ్ వాల్ పరిసరాలను హైడ్రా కమిషనర్పరిశీలించారు.
రిటైనింగ్ వాల్ కూలడంతో ప్రమాదకరంగా మారిన రెండు ఇండ్లను ఇటీవలే హైడ్రా ఖాళీ చేయించగా, వెంటనే వాల్ నిర్మించాలని ఆదేశించారు. సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. హైడ్రా ఆఫీసులో నాలా పనులపై కంటోన్మెట్ సీఈవో మధుకర్ నాయక్ తో కలిసి సమీక్షించారు. ఇందులో హైడ్రా, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ, కంటోన్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ప్యాట్నీ పరిసరాల్లో నాలా కుచించుకుపోవడంతో పై భాగంలో ఉన్న కొన్ని కాలనీలు మునిగేవని, నాలా విస్తరణతో ముప్పు తప్పిందన్నారు.