‘వాటర్ గేట్’ కుంభకోణానికి 50 ఏళ్లు

‘వాటర్ గేట్’ కుంభకోణానికి 50 ఏళ్లు

అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్క అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఆయనే ‘రిచర్డ్ నిక్సన్’.  అధ్యక్ష పీఠం నుంచి ఆయన దిగేలా చేసిన కుంభకోణం పేరు ‘వాటర్ గేట్’.  ఇది బయటపడి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. 1972 జూన్ మూడో వారంలో ఉత్కంఠభరిత పరిణామాల నడుమ ఇది వెలుగుచూసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అమెరికా రాజధాని వాషింగ్టన్ కు అత్యంత సమీపంలో ఉండే ఆరు భవనాల సముదాయం పేరే ‘వాటర్ గేట్ కాంప్లెక్స్’. వీటి ప్రత్యేకత ఏమిటంటే..  ఈ భవనాల ఫ్లాట్లలోనే ఎంతోమంది అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రధాన ప్రజాప్రతినిధులు నివసిస్తుంటారు. వాటర్ గేట్ ఆఫీస్ బిల్డింగ్ లోనే నాటి ప్రతిపక్షం ‘డెమొక్రటిక్ నేషనల్ కమిటీ’  ప్రధాన కార్యాలయం కూడా ఉంది. 1972 జూన్ 17న వేకువజామున ఈ ఆఫీసులోకి నైట్ వాచ్ మన్ ఎంటర్ అయ్యాడు. తలుపులన్నీ మూసే పనిలో నిమగ్నమయ్యాడు. ఒక తలుపు మాత్రం ఎంతకూ మూసుకుపోలేదు. ఎందుకలా అవుతోందని సందేహించిన వాచ్ మన్.. తలుపు వెనకాలకు చూశాడు. దీంతో తలుపు వెనుక భాగంలో టేప్ అమర్చి ఉన్నట్లు వెల్లడైంది. దీనిపై  వెంటనే పోలీసులకు అతడు సమాచారం అందించాడు.  

ఆ ఒక్క ఘటనతో వెలుగులోకి..

ఈ ఒక్క ఘటన ఎన్నో విషయాలను వరుసగా బయటపెట్టి.. చివరకు వాటర్ గేట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. దర్యాప్తులో సంచలన విషయాలను గుర్తించారు. నేరుగా వైట్ హౌస్ తో సంబంధమున్న పలువురు ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు.. సూట్లు, టై ధరించిన ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు  వాటర్ గేట్ కాంప్లెక్స్ లోని ‘డెమొక్రటిక్ నేషనల్ కమిటీ’ కార్యాలయంలోకి అక్రమంగా చొరబడినట్లు వెల్లడైంది. ఈక్రమంలోనే వారు కార్యాలయంలోని తలుపులు సహా పలుచోట్ల మైక్రో ఫోన్లను అమర్చి వెళ్లారని తేలింది. ఆఫీసులోని పలు కీలక డాక్యుమెంట్ల ఫొటోలను కూడా వాళ్లు తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిసింది. అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న డెమొక్రటిక్ పార్టీ ముఖ్య నాయకుల సమాచారాన్ని సేకరించడమే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై ‘వాషింగ్టన్ పోస్ట్’ జూన్ 18న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘ఆల్ర్ఫెడ్ ఈ.లూయీస్’ అనే రిపోర్టర్ బై లైన్ తో ప్రచురితమైన ఈ స్టోరీ అప్పట్లో అమెరికాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత లోతైన దర్యాప్తు కొనసాగింది. ఫలితంగా రెండేళ్ల తర్వాత (1974 ఆగస్టు 9న)  రిచర్డ్ నిక్సన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గెరాల్డ్ ఫోర్డ్ .. రిచర్డ్ నిక్సన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు.  ఈ కేసులో మాజీ ఎఫ్ బీ ఐ ఏజెంట్ జి.గోర్డన్ లిడ్డీకి మాత్రమే జైలు శిక్ష (6సంవత్సరాల 8 నెలలు) పడింది. నాలుగున్నరేళ్లు జైలుశిక్ష అనుభవించిన తర్వాత ఆయనను విడుదల చేశారు. నాడు ‘వాషింగ్టన్ పోస్ట్’లో వాటర్ గేట్ కుంభకోణంపై పరిశోధనాత్మక కథనాన్ని రాసిన రిపోర్టర్ల బృందానికి పులిట్జర్ ప్రైజ్ కూడా వరించింది. 

పలు కీలక ఘటనలు..  

1972 జూన్ 17 :   వాటర్ గేట్ భవన సముదాయంలోని డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన ఐదుగురిని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. 

1972 జూన్ 18 : దీనిపై ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. 

1972 జూన్ 25 :  ఈ కుంభకోణంలో మాజీ ఎఫ్ బీ ఐ  ఏజెంట్ ఆల్ర్ఫెడ్ బాల్డ్విన్ ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తునకు సహకరించేందుకు ఆయన అంగీకరించారు. వాటర్ గేట్ భవన సముదాయంలోని డెమొక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన వారిలో నిక్సన్ ఎన్నిక ప్రచార కార్యక్రమాలు పర్యవేక్షించే ఈ.హోవర్డ్ హంట్, జి.గోర్డన్ లిడ్డీ ఉన్నారనే సంచలన విషయాలను ఆల్ర్ఫెడ్ బాల్డ్విన్ వెల్లడించారు.  

1972 ఆగస్టు 1 :  వాటర్ గేట్ భవన సముదాయంలోని డెమొక్రటిక్ నేషనల్ కమిటీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడిన ఐదుగురిలో ఒకరైన బెర్నార్డ్ బార్కర్ బ్యాంకు ఖాతాలోకి ఓ నిర్దిష్ట మొత్తం జమ అయిందని వెలుగుచూసింది. 1972 అధ్యక్ష ఎన్నికల కోసం రిచర్డ్ నిక్సన్ కేటాయించుకున్న బడ్జెట్ నుంచి ఈ నిధులు వచ్చాయని గుర్తించారు. 

1972 ఆగస్టు 29  :  నిక్సన్ మళ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి  .. ఈ ఘటనతో తమ పార్టీకి సంబంధం లేదని తేల్చిచెప్పారు. వాటర్ గేట్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు అక్కర్లేదని స్పష్టం చేశారు. 

1972 సెప్టెంబరు 29 :  నిందితులకు అందిన డబ్బు వెనుక.. నాటి అటార్నీ జనరల్ జాన్ మిచెల్ కూడా ఉన్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనాన్ని ప్రచురించింది. 

1973 ఏప్రిల్ 30 :  వాటర్ గేట్ కుంభకోణానికి తానే బాధ్యుడినని రిచర్డ్ నిక్సన్ అంగీకరించారు. అయితే తనకు తెలియకుండా అది జరిగిందని వెల్లడించారు.