హైదరాబాద్: 80 కి.మీ వెంబడించి 500 కిలోల గంజాయి సీజ్

హైదరాబాద్: 80 కి.మీ వెంబడించి 500 కిలోల గంజాయి సీజ్
  •     డ్రైవర్ పరారీ.. బొలేరో స్వాధీనం
  •     ఒడిశా ఏజెన్సీలో ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గంజాయి సప్లయర్లపై ఈగల్ ఫోర్స్ గట్టిగా నిఘా పెట్టింది. ఒడిశా సహా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒడిశాలోని బలిమెల నుంచి గంజాయితో వెళ్తున్న ఒక బొలెరో వాహనాన్ని ఈగల్ ఫోర్స్ సిబ్బంది దాదాపు 80 కిలోమీటర్ల మేర వెంబడించి పట్టుకున్నారు. అందులోంచి 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, బొలెరోను సీజ్ చేశారు. ఈ మేరకు ఈగల్ ఫోర్స్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.రాష్ట్రంలో ఇటీవల పట్టుబడిన గంజాయి ముఠాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈగల్ ఫోర్స్ సిబ్బంది నిఘా తీవ్రం చేశారు. ఈ క్రమంలోనే ఒడిశాలోని బలిమెల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు కచ్చితమైన సమాచారం అందుకున్నారు. దీంతో స్థానిక ఈగల్ ఫోర్స్ పెట్రోలింగ్ పార్టీ ఎస్‌‌ఐ రవి ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. 

ఆ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక బొలెరో వాహనాన్ని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. దీంతో అప్రమత్తమైన ఈగల్ ఫోర్స్ పోలీసులు.. బలిమెల నుంచి జైపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర వాహనాన్ని వెంబడించారు. చివరకు ఒక అటవీ ప్రాంతంలో నిలిపి ఉంచిన బొలెరో వాహనాన్ని గుర్తించారు. అయితే పోలీసులను చూసి డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోవడంతో, ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సదరు బొలెరో వాహనం ఒడిశాలోని నబరంగ్‌‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసును స్థానిక కొరపుట్ పోలీసులకు అప్పగించారు.

ఫార్చునర్​లో 80 కిలోల గంజాయి..

మణుగూరు, వెలుగు: ఫార్చునర్ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.40 లక్షల విలువైన 80 కేజీల గంజాయిని మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మండలంలోని సమ్మక్క–సారలమ్మ టెంపుల్ సమీపంలో గురువారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ ఫార్చునర్ కారు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఇందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జున్‌‌‌‌జున్ జిల్లా గుడిగౌర్‌‌‌‌చి మండలానికి చెందిన సురేంద్ర సింగ్, నీముకి దామీ బామ్లాస్ మండలానికి చెందిన ధర్మేంద్ర కుమార్‌‌‌‌ ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి గంజాయిని తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

ఒడిశా నుంచి హైదరాబాద్​కు సప్లయ్​..

మల్కాజ్‌‌‌‌గిరి: ఒడిశా నుంచి హైదరాబాద్‌‌‌‌కు గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ ఎస్‌‌‌‌వోటీ ఎల్‌‌‌‌బీనగర్ టీమ్, అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.25.90 లక్షల విలువైన 51.800 కిలోల గంజాయితో పాటు బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌‌‌‌గిరి జిల్లాకు చెందిన కములు పాంగి, బాబిని హంతాల్, కృష్ణ హంతాల్​ఈ నెల 15న ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి తీసుకొచ్చారు. సాగర్​కు ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం ఘట్‌‌‌‌కేసర్ వైపు బయలుదేరారు. పోలీసులు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై తారా కన్వెన్షన్ హాల్ సమీపంలో వారిని పట్టుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సాగర్ కోసం గాలిస్తున్నారు.