5,111 అంగన్​ వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు వెంటనే భర్తీ

5,111 అంగన్​ వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు వెంటనే భర్తీ
  • రాష్ట్ర కేబినెట్​ భేటీలో నిర్ణయం
  • 5,111 అంగన్​ వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు వెంటనే భర్తీ
  • 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 15 నుంచి కొత్తగా 10 లక్షల ఆసరా పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర కేబినెట్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఖాళీగా ఉన్న 5,111 అంగన్​వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు ఓకే చెప్పింది. గ్రామకంఠంలో ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, ఇందుకోసం అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్​లో రాష్ట్ర కేబినెట్​ సమావేశం జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత కొన్నేండ్లుగా పెండింగ్​లో ఉన్న పెన్షన్లు, ఇతర అంశాలపై చర్చించారు. కోఠి ఈఎన్ టీ హాస్పిటల్​లో ఈఎన్​టీ టవర్ నిర్మించాలని కేబినెట్​ నిర్ణయించింది. సరోజినీ దేవి కంటి దవాఖానలో కొత్త బిల్డింగ్​​ నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది.  కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలోనూ అధునాతన హాస్పిటల్ నిర్మాణానికి  ప్రపోజల్స్ రెడీ చేయాలంది. కోఠి ఈఎన్​టీ హాస్పిటల్​కు 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేసింది. జీవో 58,59 కింద పేదలకు పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్​కుమార్ ను కేబినెట్ ఆదేశించింది. వికారాబాద్ లో ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం, తాండూరు మార్కెట్ కమిటీకి యాలాలలో 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. షాబాద్ లో టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో షాబాదుబండల పాలిషింగ్ యూనిట్లు ఏర్పాటు కోసం 45 ఎకరాల భూమిని కేటాయించింది.  

ఎఫ్​ఆర్బీఎం పరిమితుల్లో కోతలు లేకుంటే ఆదాయం పెరిగేది

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్​లో చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర  ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్ (సెంట్రల్లీ స్పాన్సర్డ్​ స్కీమ్స్​), వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు  మైనస్ -12.9 శాతం తగ్గిందన్నారు. అయినా ఈ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హమని సీఎం కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా కేంద్రం నిధుల విడుదలలో, ఎస్ఎన్ఏ (స్టేట్ నోడల్ అకౌంట్) అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడంతో రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని చర్చించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితుల్లో కోతలు విధించకుండా ఉంటే ఆదాయం మరింత పెరిగేదని, దాదాపు 22 శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని కేబినెట్ భావించింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 11.5 శాతం వృద్ధితో దేశంలోనే  తెలంగాణ ప్రథమస్థానంలో ఉందని అధికారులు కేబినెట్ కు వివరించారు. సీఎస్ఎస్ లో గత ఎనిమిదేండ్లలో రాష్ట్రానికి రూ. 47,312 కోట్లు వచ్చాయని ఆర్థిక శాఖ వివరించింది. అయితే, గత నాలుగేండ్లలో ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు రూ. 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించినట్లు కేబినెట్​కు ఆఫీసర్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం లక్షా 84 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది రూ. 5,200 కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రం అవలంబిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని సీఎం విమర్శించారు. రాష్ట్రం సాధించిన ప్రగతి.. కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ. 14.50 లక్షల కోట్లకు చేరుకునేదని ఆయన అన్నారు.

21న జరగాల్సిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రద్దు

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న తలపెట్టిన అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఆరోజున పెళ్లిళ్లు, శుభకార్యాలకు చివరి ముహూర్తం కావడం వల్ల, పెద్దఎత్తున వివాహాది కార్యక్రమాలు ఉన్నందున, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని సమావేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలని కేబినెట్​ నిర్ణయించింది.  75 మంది ఖైదీల విడుదలకు ఓకే చెప్పింది.