
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించాడని ఓ దళిత రైతుని చితకబాది చివరికి తల నరికేశారు. బుడాన్ జిల్లాలోని షేక్‌పూర్ గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాత్తు లాల్ జాతవ్(56) , తన కొడుకు ఓంపాల్ తో కలసి.. సోమవారం సాయంత్రం తమ పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. కాసేపటి తర్వాత కొడుకుని ఇంటికి వెళ్లమని, పొలంలో పనిఉండడం వల్ల తాను కొంచెం ఆలస్యంగా వస్తానని, భోజనం సిద్ధంగా ఉంచమని చెప్పడంతో అతను వెళ్లి పోయాడు.
ఆ సమయంలో పక్క పొలం రైతు కిషోర్.. తన పొలానికి నీళ్లు వదలమని అడగ్గా.. అందుకు జాదవ్ నిరాకరించాడు. దీంతో కోపంతో .కిషోర్ జాదవ్‌ను దూషించడంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో జాదవ్ ను కిషోర్ చితకబాది, అతని తలనరికి వేశాడని ఆ సమయంలో అక్కడున్న గ్రామస్తులు సాక్ష్యం చెప్పారు. తాము అడ్డుకోబోతే అడ్డొచ్చిన వారిని చంపుతానని నిందితుడు బెదిరించాడని వారు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు.
అయితే ఉదయం వరకు తండ్రి రాకపోవడంతో, ఓంపాల్ మంగళవారం ఉదయం పొలం వైపు వెళ్లగా తండ్రి శవం కనిపించదని చెప్పాడు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి అతనిపై హత్యా నేరంతోపాటు దళిత అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు