
జీడిమెట్ల, వెలుగు: కల్తీ కల్లులో కలిపే క్లోరో హైడ్రెట్ను బాలానగర్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పీఎస్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలానికి చెందిన రామాగౌడ్ సిటీకి వచ్చి బోయిన్పల్లిలో ఉంటూ మత్తు పదార్థాలను అమ్ముతున్నాడు. టీ న్యాబ్ అధికారులు అందించిన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులురామాగౌడ్ పై నిఘాపెట్టారు.
బోయిన్ పల్లి క్రాస్ రోడ్ ఏరియాలో తనిఖీలు చేపట్టారు. కారులో వస్తున్న రామాగౌడ్ ను అడ్డుకుని వెహికల్ ను చెక్ చేశారు. 20 బ్యాగుల్లో తరలిస్తున్న 560 కిలోల క్లోరో హైడ్రైట్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని రాజు భాయ్ అనే వ్యక్తి నుంచి క్లోరో హైడ్రెట్ను కొని ఆదిలాబాద్ లో అమ్మేందుకు వెళ్తున్నట్లు రామా గౌడ్ పోలీసులకు చెప్పాడు. అతడిని అరెస్ట్ చేసి క్లోరో హైడ్రైట్ తో పాటు కారును సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్ తెలిపారు.