నిలిచిపోయిన రిజర్వేషన్లతో ప్రభుత్వానికి  రూ.60 కోట్లు నష్టం

నిలిచిపోయిన రిజర్వేషన్లతో ప్రభుత్వానికి  రూ.60 కోట్లు నష్టం

ఉమ్మడి కరీంనగర్‌‌‌‌ జిల్లాలో  కరీంనగర్, కరీంనగర్ రూరల్ ( తిమ్మాపూర్), గంగాధర, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్, జగిత్యాల, మల్యాల, మెట్‌‌పల్లి, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ,  హుజూరాబాద్‌‌, హుస్నాబాద్, భీమదేవరపల్లిలో సబ్ రిజిస్ట్రార్‌‌‌‌ కార్యాలయాలు ఉన్నాయి.  వీటిలో గ్రేడ్‌‌ వన్‌‌ కేటగిరీలో ఉన్న కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, గంగాధరలో రోజుకు 60 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. గ్రేడ్‌‌ టూ కేటగిరీలో ఉన్న మిగతా ఆఫీసుల్లో  20 నుంచి 60 వరకు అయ్యేవి. అయితే ఇప్పుడు ఒక్క రిజిస్ట్రేషన్‌‌ కూడా కావడం లేదు. ఆఫీసులు తెరిచి ఉంచినా, సబ్‌‌ రిజిస్ట్రార్లు వచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది.

మూత పడ్డ షాపులు..

ఒక సబ్‌‌ రిజిస్ట్రార్‌‌‌‌ ఆఫీస్‌‌ దగ్గర పదుల సంఖ్యలో డాక్యుమెంట్‌‌ రైటర్ల షాప్‌‌లు, జిరాక్స్‌‌ షాపులు ఉంటాయి. కరోనా భయం కారణంగా ఇప్పుడవన్నీ మూతపడ్డాయి. లాక్‌‌డౌన్‌‌ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో షాప్‌‌లు బోసిపోతున్నాయి. రోజుకు వందకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగితే ప్రభుత్వానికి సుమారు రూ. 3 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడది ఆగిపోయింది. 21 రోజుల లాక్‌‌డౌన్‌‌తో  మొత్తం సుమారు రూ.50 నుంచి 60 కోట్ల వరకు ఆదాయానికి గండి పడ్డట్లయింది.

పరోక్షంగా ఉపాధికి దెబ్బ

ఈ ఆఫీస్‌‌ల చుట్టూ ఉండే చిన్న చిన్న హోటళ్లు, జ్యూస్‌‌ సెంటర్లు కూడా మూత పడడంతో చాలా మందికి ఉపాధి లేకుండా పోయింది. షాపులలో పని చేసే గుమాస్తాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. లాక్‌‌డౌన్‌‌ ఎప్పుడు ఎత్తి వేస్తారో, ఆఫీస్‌‌లు ఎప్పుడు కళకళలాడుతాయో అని వీరంతా ఎదురుచూస్తున్నారు.