టీఎస్​పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు!

టీఎస్​పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు!
  • ఇద్దరు ఐఏఎస్​లు, ముగ్గురు ఐపీఎస్​ల దరఖాస్తు​
  • ఇయ్యాల సర్కార్​కు లిస్టు అందజేయనున్న జీఏడీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) చైర్మన్ సహా మెంబర్ పోస్టులకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 600 వరకు దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. టీఎస్ పీఎస్సీలో చైర్మన్, మరో పది మంది మెంబర్లను నియమించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక మెంబర్ కొనసాగుతున్నారు. ఆయా పోస్టులకు ఈ నెల12 నుంచి18 వరకు అర్హులైన వారి నుంచి సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు 600 వరకు అప్లికేషన్లు రాగా, గురువారం చివరి గంటలోనే  ఏకంగా వందకు పైగా దరఖాస్తులు అందాయి. కొందరు రెండు, మూడు అప్లికేషన్లు కూడా పెట్టుకున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికి తోడు 62 ఏండ్లు దాటినోళ్లు కూడా అప్లై చేసుకున్నట్టు తెలిసింది. శనివారం ఫైనల్ లిస్టును సర్కారుకు జీఏడీ అధికారులు అందించనున్నారు. వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేసేందుకు సర్కారు స్ర్కూటినీ/ సెర్చ్ కమిటీని నియమించే అవకాశం ఉంది. ఆ కమిటీ దరఖాస్తు చేసుకున్నోళ్లలో అర్హులు ఎందరున్నారనేది తేలుస్తుంది. ఆ కమిటీ ఇచ్చే లిస్టుల్లోంచి చైర్మన్, మెంబర్లను గవర్నర్ నియమించనున్నారు. కాగా, అప్లై చేసుకున్నోళ్లలో ఇద్దరు ఐఏఎస్​ఆఫీసర్లతో పాటు ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నట్టు తెలిసింది. సెంట్రల్ సర్వీసుల్లో పని చేస్తున్న వారూ దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువగా వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు అప్లై చేసుకున్నారు. కొందరు చైర్మన్ తో పాటు మెంబర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. కేవలం చైర్మన్ పోస్టు కోసం 30 మంది వరకు అప్లై చేసుకున్నట్టు సమాచారం.

చైర్మన్​రేసులో ఐఏఎస్?

టీఎస్ పీఎస్సీ చైర్మన్ రేసులో ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు ఐపీఎస్ లు ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలో ఓ ఐఏఎస్ కూడా చేరినట్టు తెలిసింది. దరఖాస్తు చేసుకున్నోళ్లలో ఇద్దరు ఐఏఎస్​లు ఉండగా.. వారిలో ఒకరు సర్వీసులో కొనసాగుతుండగా, మరొకరు రిటైర్డ్ అధికారి. సర్వీసులో కొనసాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన వ్యవహారాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. దీంతో ఆ అధికారి చైర్మన్ రేసులో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.