ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి సప్లై..ముగ్గురు అరెస్ట్

ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి సప్లై..ముగ్గురు అరెస్ట్
  •     60.380 కిలోల గంజాయి స్వాధీనం 
  •     ఎస్​వోటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసుల జాయింట్​ ఆపరేషన్‌‌

మల్కాజ్​గిరి, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్‌‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును మల్కాజ్​గిరి కమిషనరేట్ పోలీసులు రట్టు చేశారు. ఎస్‌‌వోటీ ఉప్పల్ జోన్, నాచారం పోలీసులు జాయింట్​ఆపరేషన్‌‌ నిర్వహించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన 60.380 కిలోల ఎండు గంజాయి, ఒక కారు, 4 సెల్‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేశ్​కుమార్​ఆదివారం వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో ఈ నెల 20న ఐడీఏ నాచారం రోడ్ నంబర్ 5 వద్ద నిఘా పెట్టిన పోలీసులు, కారులో గంజాయి తరలిస్తున్న ముంబైకి చెందిన సమీర్ హసన్ అలీ షేక్, కింగ్‌‌కోఠికి చెందిన మహమ్మద్ ఖాన్, కూకట్‌‌పల్లికి చెందిన చందన్ కుమార్ జెనాలను అదుపులోకి తీసుకున్నారు. 

ఒడిశాకు చెందిన ప్రధాన సరఫరాదారు రాహుల్, అతని అనుచరుడు అజయ్ సాగర్ పరారీలో ఉన్నారు. ఒడిశాలో కిలో గంజాయిని రూ.2 వేలకే కొనుగోలు చేసి, హైదరాబాద్, ముంబై నగరాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు ఈ ముఠా ప్లాన్​చేసినట్లు విచారణలో తేలింది. ట్రిప్‌‌కు రూ.5 వేల నుంచి రూ.8 వేల కమీషన్ ఆశచూపి వీరితో రవాణా చేయిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. సీపీ సుమతి ఆదేశాలతో ఈ ఆపరేషన్ చేపట్టామని డీసీపీ పేర్కొన్నారు.