రాష్ట్రంలో చదువుకున్న మహిళలు 66.6 శాతం.. పురుషులు 84.8 శాతం

రాష్ట్రంలో చదువుకున్న మహిళలు 66.6 శాతం.. పురుషులు 84.8 శాతం

మగవాళ్లు 84.8 శాతం
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: మన రాష్ట్రంలో మహిళల లిటరసీ రేట్ 66.6 శాతం ఉండగా, మగవాళ్ల లిటరసీ రేట్ 84.8 శాతం ఉంది. ఈ మేరకు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో (ఎన్ఎఫ్‌హెచ్ఎస్) వెల్లడైంది. ఎన్ఎఫ్‌హెచ్ఎస్ పోయినేడు రాష్ర్టంలోని 27,351 కుటుంబాలపై సర్వే చేయగా.. వీరిలో 27,518 మంది మహిళలు, 3,863 మంది మగవాళ్లు ఉన్నారు. అర్బన్ ఏరియాలో మహిళల లిటరసీ రేట్ 81 శాతం ఉండగా, రూరల్ ఏరియాలో 58.1 శాతమే ఉందని సర్వేలో తేలింది. ఇక మగవాళ్ల విషయానికొస్తే అర్బన్‌లో 90.2 శాతం, రూరల్‌లో 81.3 శాతం ఉంది. ఇక టెన్త్ చదివిన మహిళలు 45.5 శాతం, మగవాళ్లు 61.2 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. టెన్త్ ఆపైన చదువుకున్న మహిళలు రూరల్‌లో 36.3 % మంది ఉండగా, అర్బన్‌లో 60.9 శాతం మంది ఉన్నారు. మగవాళ్ల విషయానికొస్తే అర్బన్‌లో 71 శాతం, రూరల్ లో 54.6 శాతం ఉన్నారు. అయితే రెండు నెలల కింద విడుదలైన నేషనల్‌‌‌‌ స్టాటిస్టికల్‌‌‌‌ సర్వేలో మన రాష్ట్రంలో 72.8 శాతం లిటరసీ రేట్ ఉన్నట్లు తేలింది.

మహిళలు ఇంటర్నెట్ వాడ్తలె..
ఇంటర్నెట్ వినియోగించే మహిళల శాతం కూడా మన రాష్ట్రంలో తక్కువగా ఉంది. అర్బన్‌లో 43.9 శాతం, రూరల్‌లో 15.8 శాతం మంది మహిళలే ఇంటర్నెట్ వాడుతున్నారు. ఓవరాల్‌గా చూస్తే 26.5 శాతం మహిళలు ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఇక మగవాళ్లు అర్బన్‌లో 72.3 శాతం, రూరల్‌లో 46.7 శాతం.. మొత్తంగా 57.4 శాతం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు.