ఈ కుక్కల తెలివికి సలాం కొట్టాల్సిందే.. కిడ్నాపర్ల కళ్లుగప్పి 17 కి.మీ. ప్రయాణం.. ఇంటికి చేరిన వీడియో వైరల్ !

ఈ కుక్కల తెలివికి సలాం కొట్టాల్సిందే.. కిడ్నాపర్ల కళ్లుగప్పి 17 కి.మీ. ప్రయాణం.. ఇంటికి చేరిన వీడియో వైరల్ !

కథల్లో చదివి ఉంటాం.. పెద్దలు చెబుతుంటే విని ఉంటాం.. కుక్కలు, పిల్లులు, పశువులు, మేకలు లాంటి జంతువులు ఎన్ని ఆమడల దూరంలో వదిలేసినా.. ఏటికి అవతల పడేసినా మళ్లీ ఇంటికి చేరుకుంటాయని. అది నిజం అని నిరూపించే స్టోరీ ఇది. నోరు లేని జీవులే కదా అని కిడ్నాప్ చేస్తే.. దొంగల కళ్లు గప్పి 17 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్న దయనీయమైన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

చైనాలో జరిగిన ఈ ఘటన హాలీవుడ్ స్టోరీని ఒక హాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంది.  యజమానులు తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఏడు కుక్కలను మాంసం షాపు కోసం ఎత్తుకెళ్లారు దొంగలు. డాగ్ మీట్ షాప్‌కు తీసుకెళ్లే ట్రక్కు నుంచి తప్పించుకుని, సుమారు 17 కిలోమీటర్లు నడిచి తమ ఊరికి చేరుకున్నాయి. వీడియోలో కార్గి (Corgi) అనే కుక్క ముందు నడుస్తూ తన స్నేహితులను వెనక్కి చూస్తూ నడుపుతున్నట్లు ఉండే వీడియో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఒక జర్మన్ షెపర్డ్ కుంటుతూ వెనుక నుంచి అందరినీ కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. వీటితో పాటు గోల్డెన్ రిట్రీవర్, లాబ్రడార్, పికింగీస్ కుక్కలు కూడా ఈ బృందంలో ఉన్నాయి.

బిజీ హైవే పక్కన ఈ కుక్కల బృందాన్ని చూసిన లు (Lu) అనే వ్యక్తి వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇవి తప్పిపోయిన చిన్న అన్నదమ్ముల గుంపు లాగా ఉన్నాయి. ఒక్కటి కూడా తప్పిపోకుండా క్రమపద్ధతిలో నడుస్తున్నాయి. కాలక్షేపం కోసం తిరుగుతున్న కుక్కల్లా కనిపించడం లేదు అంటూ పోస్ట్ చేశాడు.  ఆ వీడియోను చైనీయ సోషల్ మీడియా యాప్ డౌయిన్‌లో పోస్ట్ చేసి, అధికారుల సహాయం కోరాడు. 

‘బిట్టర్ కాఫీ స్ట్రే డాగ్ బేస్’  అనే జంతు సంక్షేమ సంస్థ ఈ కుక్కలు ఒకే ఊరికి చెందినవి కావచ్చని, ఒకసారి కలిసి తిరగడం వల్ల వాటి మధ్య బలమైన బంధం ఏర్పడి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత డ్రోన్లు ఉపయోగించి వాటిని ట్రాక్ చేసి సురక్షితంగా ఇంటికి చేర్చారు. కుక్కలు ఇంటికి రావడంతోయజమానుల ఆనందానికి అవధులు లేవు. మేము చాలా అదృష్టవంతులం. అవి తిరిగి వచ్చాయి,వాటిని చంపి తినేసి ఉంటారని ఆందోళన చెందాం.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కుక్కలన్నింటిని ఇంటికి తీసుకొచ్చిన కార్గి ధైర్యం, తెలివితేటలను దాని యజమాని మెచ్చుకున్నాడు. 

చైనాలో కుక్క మాంసం వినియోగంపై దేశవ్యాప్తంగా నిషేధం లేదు. అయితే 2020లో షెన్‌జెన్ నగరం కుక్క, పిల్లి మాంసం అమ్మకాలు నిషేధించింది. అయినప్పటికీ కొన్ని రెస్టారెంట్లు, ముఖ్యంగా శీతాకాలంలో ఇప్పటికీ సర్వింగ్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. కుక్కలు తెలివిగా తప్పించుకోవడం లక్షలాది మంది హృదయాలను కదిలించింది. కుక్కల స్నేహం, బంధం ఎంత బలమైనదో మరోసారి నిరూపించింది!