బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

బాణసంచా గోదాంలో భారీ పేలుడు.. ఏడుగురు కార్మికులు సజీవ దహనం

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (జూన్ 9) జైపూర్‌లోని ఓ అక్రమ బాణసంచా గోదాంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. 

జైపూర్‌లోని తలాయ్ కాలనీలో అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచిన ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భారీ పేలుడు తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు కార్మికులు లోపల చిక్కుకుపోయారని తెలిపారు. ఏడుగురూ కాలిన గాయాలతో మరణించారని జైపూర్ ఏసీపీ వినోద్ శర్మ ధృవీకరించారు.

 వీరిలో ఐదుగురు ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. ఒకరు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మరొకరు ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. మృతులను సమీర్, ఆబిద్, నాసిర్, అబ్దుల్ వాహిద్, బిలాల్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిల్వ ఉంచిన అత్యంత మండే స్వభావం గల పదార్థం పేలుడుకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. 

పేలుడు తర్వాత భారీగా ఎగసిపడుతోన్న మంటల నుంచి తప్పించుకోవడానికి కార్మికులు పరుగులు తీయడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొందని ప్రత్యక్ష  సాక్షులు వివరించారు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి లోపల చిక్కుకున్న పలువురిని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, మాజీ సీఎం అశోక్ గ్లెహాట్ సంతాపం వ్యక్తం చేశారు.