సింహాచలం ఆలయం​లో గోడ కూలి 8 మంది మృతి

సింహాచలం ఆలయం​లో గోడ కూలి 8 మంది మృతి
  • ఆరుగురికి తీవ్ర గాయలు, విషమంగా ఇద్దరి పరిస్థితి 

హైదరాబాద్, వెలుగు:  విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. చందనోత్సవం సందర్భంగా బుధవారం దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా తెల్లవారుజామున రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్, ఎస్డీఆర్‌‌‌‌ఎఫ్, ఫైర్, రెవెన్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింహాచలం దుర్ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

మృతులకు నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ కమిషన్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. సింహాచలం చందనోత్సవంలో మరణించిన భక్తుల కుటుంబాలను మాజీ సీఎం, వైఎస్సార్‌‌‌‌సీపీ అధ్యక్షుడు వైయస్‌‌‌‌ జగన్‌‌‌‌ పరామర్శించారు.