- 6 లక్షల మందికి పైగా ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్ష
- డైరెక్ట్‌గా టెన్త్ఎగ్జామ్ రాసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు సంతకం పెట్టడం రాక వేలిముద్రలతో సరిపెట్టుకున్న చేతులు.. ఇప్పుడు బలపం పట్టి అక్షరాలు దిద్దుతున్నాయి. వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ప్రపంచాన్ని చదివేందుకు రెడీ అవుతున్నారు. పల్లెల్లోని మహిళల్లో నిరక్షరాస్యతను నిర్మూలించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చదువుకోవాలనే ఆశ ఉన్న మహిళలకు అమ్మకు అక్షరమాల వరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది మహిళలు ఈ ఉద్యమంలో భాగస్వాములమయ్యారు.
- సులభ పద్ధతిలో విద్యాబోధన..
ప్రతి గ్రామ సంఘంలో 40 నుంచి 60 మంది మహిళలను గ్రూపుగా చేసి స్థానిక వలంటీర్ల ద్వారా విద్యను బోధిస్తున్నారు. వీరికి నిత్యజీవితంలో వాడే పదాల ద్వారా సులభంగా చదవడం, రాయడం నేర్పిస్తున్నారు. ఇంటి పనులన్నీ ముగించుకున్నాక సాయంత్రం ఊరి రచ్చబండ దగ్గర లేదా పాఠశాల ఆవరణలో మహిళలు కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్నారు.
ఇందులో భాగంగా 6 లక్షల మందికి పైగా మహిళలు ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ (ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్ర అంచనా పరీక్ష) రాశారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వీరు నేరుగా పదో తరగతి పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదు, అక్షరాలు నేర్చుకోవడం వల్ల మహిళలు బ్యాంకులకు వెళ్లినప్పుడు ఇతరుల సహాయం లేకుండానే ఫారాలు నింపి సంతకాలు చేస్తున్నారు.
