పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందం.. ఏడుగురు ఎంపీలు వీళ్లే..

పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందం.. ఏడుగురు ఎంపీలు వీళ్లే..

ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ను ఏకాకిని చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది భారత్.. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందు పెట్టేందుకు ఏడుగురు ఎంపీల అధ్యక్షతన అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ ఏడుగురు ఎంపీలలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కి చోటు దక్కింది. అయితే కాంగ్రెస్ పంపిన జాబితాలో శశి థరూర్ పేరు లేకపోవడం గమనార్హం.పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచం ముందు ఉంచేందుకు పంపే బృందం కోసం పేర్లు ప్రతిపాదించాలని శుక్రవారం ( మే 16 ) కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ ను కోరారు.

ఈ క్రమంలో రాహుల్ గాంధీ నాలుగు పేర్లు ప్రతిపాదించారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్ సభ ఎంపీ రాజా బ్రార్, గౌరవ్ గొగొయ్ ఉన్నారని.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాంగ్రెస్ పంపిన జాబితాలో శశి థరూర్ పేరు లేకపోయినా..ఇవాళ కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో కాంగ్రెస్ నుంచి శశి థరూర్ పేరు మాత్రమే ఉండటం ఆసక్తికరంగా మారింది.

అఖిలపక్ష బృందాల జాబితాలో తనకు స్థానం కల్పించడంపై స్పందించిన శశి థరూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.. ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానని... దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే. నేను అందుబాటులో ఉంటా. జైహింద్.. అంటూ ట్వీట్ చేశారు శశి థరూర్. ఈ జాబితాలో శశి థరూర్ సహా రవిశంకర్ ప్రసాద్ (బిజెపి), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), బైజయంత్ పాండా (బిజెపి), కనిమొళి కరుణానిధి (డీఎంకే), సుప్రియా సూలే (NCP), శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే (శివసేన) లకు చోటు దక్కింది.