జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పరిధిలోని ఆల్విన్ కాలనీ రెస్క్యూ హోం నుంచి ఏడుగురు మహిళలు తప్పించుకొని పారిపోయారు. పీటా కేసుల్లో పట్టుబడి ఇక్కడ పునరావాసం పొందుతున్న 9 మంది మహిళలు.. ఆదివారం రాత్రి నీళ్ల ట్యాంకర్ కోసం సిబ్బంది గేట్లు తీసిన సమయాన్ని అదనుగా చేసుకుని బయటకు పరుగులు తీశారు.
సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇద్దరిని పట్టుకోగలిగినప్పటికీ మిగిలిన ఏడుగురు పరారయ్యారు. పారిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్‌తో పాటు కెన్యా దేశానికి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెస్క్యూ హోం అధికారుల ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

