భారత పౌరసత్వం కోసం అమెరికన్లు, చైనీయుల అప్లికేషన్లు

భారత పౌరసత్వం కోసం అమెరికన్లు, చైనీయుల అప్లికేషన్లు

న్యూఢిల్లీ: భారత పౌరసత్వం కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 70 శాతం పాకిస్థాన్‌కు చెందిన వాళ్లవేనని కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇవాళ (బుధవారం) రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో భారత పౌరసత్వం కోసం వచ్చిన దరఖాస్తుల వివరాల గురించి కేరళ ఎంపీ అబ్దుల్ వహాబ్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్ సభకు వివరాలు తెలిపారు. భారత పౌరసత్వం కోసం 2021 డిసెంబర్ 14 వరకు మొత్తం 10,635 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. అందులో 7,306 పాకిస్థానీలకు చెందిన అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తర్వాతి స్థానంలో అఫ్గానిస్థానీల అప్లికేషన్లు 1,152 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇక 428 మంది ఏ దేశంతో సంబంధం లేని శరణార్థులు, 223 మంది శ్రీలంకన్‌లు, 223 మంది అమెరికన్లు, 189 మంది నేపాలీలు, 161 మంది బంగ్లా పౌరులు, పది మంది చైనీయులు మన దేశ పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్ తెలిపారు. వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. కేంద్ర హోం శాఖ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.