ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్రాక్‌డౌన్ -1.0లో భాగంగా ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన సైబర్ మోసాలు వెలుగులోకి వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 74 మ్యూల్ అకౌంట్లు గుర్తించి, వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శేర్ల రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
అక్రమ డబ్బు మార్పిడి, గేమింగ్ యాప్స్, బెట్టింగ్ ప్లాట్ఫార్మ్స్ లో అవేస్ ఖాన్, మడావి ఘనశ్యామ్, జాదవ్ సంతోష్, సూరం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్, సూరం విశ్వేశ్వర్, రాథోడ్ మనోజ్, జి. ఆర్యన్ గౌడ్, జాదవ్ గోవర్ధన్, షేక్ సమీర్, చవాన్ గోపాల్ పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నమోదైన ఎన్సీఆర్పీ ఫిర్యాదులతో 74 అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం, డెబిట్ కార్డులు, ఓటీపీ, పిన్ వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించారు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ లావాదేవీలకు దూరంగా ఉండాలన్నారు. డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సైబర్ క్రైం ఎస్సై గోపీకృష్ణ, సిబ్బంది రియాజ్, మజీద్, త్రిశూల్ పాల్గొన్నారు.

