ఓయూలో హాస్టళ్ల నిర్మాణానికి తొలి విడతలో రూ.7.5 కోట్లు

ఓయూలో హాస్టళ్ల నిర్మాణానికి తొలి విడతలో రూ.7.5 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.7.5 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి , బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌‌రెడ్డి చెప్పారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న ఈ హాస్టళ్లకు ఒక్కో దానికి రూ.14.60 కోట్ల చొప్పున దాదాపు రూ.30 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన’ పథకంలోని బాబు జగ్జీవన్ రామ్ ఛాత్రవాస్ యోజన కింద గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్‌‌ నిర్మాణానికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ అంగీకరించారని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

 ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసిన కిషన్ రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ రెండు నూతన హాస్టళ్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు సమయానికి స్కాలర్ షిప్ లను మంజూరు చేయడమే కాకుండా, విద్య పూర్తయిన తర్వాత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పన వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరంతరం తోడ్పాటును అందిస్తూనే ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవల ఓయూలో పర్యటన

కిషన్ రెడ్డి ఇటీవల ఓయూలో పర్యటించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టళ్ల నిర్వహణపై వర్సిటీ వీసీ, ఉన్నతాధికారులతో మాట్లాడారు. తర్వాత కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌‌‌‌తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. హాస్టల్ భవనాల నిర్మాణ అవసరం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ఓయూలో రూ.30 కోట్ల అంచనాతో రెండు హాస్టల్ భవనాలను (ఒక్కోదాంట్లో 250 మంది విద్యార్థుల సామర్థ్యంతో)  గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు నిర్మించాలని వీరేంద్ర కుమార్‌‌‌‌కు లేఖలు రాశారు. దీనికి స్పందించిన వీరేంద్ర కుమార్.. ఈ హాస్టల్ భవనాల నిర్మాణానికి సానుకూలంగా స్పందించారు. తొలివిడతగా రూ.7.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారని కిషన్ రెడ్డి తెలిపారు.