తెలంగాణలో 7.5% మందికి డయాబెటిస్

తెలంగాణలో 7.5% మందికి డయాబెటిస్

దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటకల్లో డయాబెటిస్ బాధితుల శాతం 10కిపైనే ఉందని సర్వేలో తేలింది. తెలంగాణలో 7.5 శాతం మంది, ఏపీలో 9.9 శాతం మంది డయాబెటిస్ బారిన పడ్డారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 25 శాతం మందికిపైగా జనరల్ ఒబెసిటీతో ఉన్నారని వెల్లడైంది. అయితే, దేశవ్యాప్తంగా డయాబెటిస్ కన్నా ప్రీడయాబెటిస్ ఎక్కువగా 15.3 శాతం మందికి ఉండగా, దక్షిణాది రాష్ట్రాల్లో 10 శాతం నుంచి 14.9 శాతం మధ్యలో ఉంది. దక్షిణాదిలో ఒక్క పుదుచ్చేరిలోనే ప్రీడయాబెటిస్ ఎక్కువ మందిలో ఉంది. అలాగే దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ 25 శాతం మందికిపైగా జనరల్ ఒబెసిటీతో ఉన్నారని సర్వేలో వెల్లడైంది.  

12 ఏండ్లు..1.13 లక్షల మందిపై సర్వే  

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డయాబెటిస్, ప్రీడయాబెటిస్, ఒబెసిటీ వంటి నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ (ఒకరి నుంచి ఒకరికి సోకని వ్యాధులు)తో ఎంత మంది బాధపడుతున్నారన్న దానిపై ఈ సర్వే నిర్వహించారు.మొత్తం 31 రాష్ట్రాలు, యూటీల్లోని 1,13,043 మందిపై 2008 నుంచి 2020 వరకూ దశలవారీగా సర్వే చేపట్టారు. ప్రతి రాష్ట్రంలో దాదాపు 4 వేల మందిపై సర్వే చేశారు. పట్టణ ప్రాంతాల్లో 33,537 మంది నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో 79,506 మంది నుంచి వివరాలు సేకరించారు. ప్రతి రాష్ట్రంలోనూ భౌగోళిక, సామాజిక, ఆర్థిక, జనాభాపరమైన అంశాల ఆధారంగా వివిధ దశల్లో ఈ సర్వేను నిర్వహించారు.  


లైఫ్ స్టైల్, తిండి మారాలె 

గతంతో పోలిస్తే దేశంలో డయాబెటిస్ తో పాటు ఇతర జీవక్రియల సంబంధమైన వ్యాధులు ఇదివరకు ఉన్న అంచనాల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. అభివృద్ధిలో ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో డయాబెటిస్ బాధితుల సంఖ్య స్టెబిలైజ్ అవుతుండగా, ఇతర రాష్ట్రాల్లో మాత్రం డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని వెల్లడైంది. అందుకే వెంటనే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ప్రత్యేకమైన పాలసీలను రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉందని రీసెర్చర్లు సూచించారు. దేశంలో నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ ను అరికట్టేందుకు ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధుల బాధితులు విపరీతంగా పెరుగుతారని వారు హెచ్చరించారు. అయితే, ప్రజలు వ్యక్తిగతంగా మంచి లైఫ్ స్టైల్, తిండి అలవాట్లు పాటించడం ద్వారానే డయాబెటిస్ ను నివారించవచ్చని సూచించారు.