అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..పాల్గొన్న స్పీకర్, మంత్రులు

అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..పాల్గొన్న స్పీకర్, మంత్రులు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర అసెంబ్లీ లాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. సభ మధ్యలో భారత రాజ్యాంగ పుస్తకాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఉంచారు. దాని రెండు వైపులా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఫొటోలను ఏర్పాటు చేశారు. ఆ ఇద్దరు మహనీయుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొదట నివాళులర్పించారు.

 ఆ తర్వాత మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీ గణేశ్, రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్, రాజ్ ఠాకూర్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసెంబ్లీ సిబ్బంది, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ‘‘భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద, అతి గొప్ప లిఖిత రాజ్యాంగం. స్వాతంత్ర్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే నాలుగు స్తంభాల మీద నిలిచిన ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ప్రతి పౌరుడి కర్తవ్యం’’ అని పేర్కొన్నారు.