కంగ్టి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి చెందాడు. సర్పంచ్ స్వరూప్ చంద్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన రుక్కియా బాయి, సంతోష్ దంపతుల పెద్ద కొడుకు సుందర్(8) సోమవారం స్థానికంగా స్కూల్ కు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తోటి పిల్లలతో ఆడుకుంటూ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కాడు. ప్రమాదవశాత్తు నీటిలో సుందర్ పడిపోయాడు. బాలుడు నీటిలో పడిన విషయాన్నీ తండా వాసులకు తెలియడంతో వెళ్లి బయటకు తీశారు. అప్పటికే బాలుడు చనిపోయాడు. బాలుడి మృతితో తండాలో విషాదం నెలకొంది.
