- దేశంలోనే మూడో అతిపెద్ద బుక్ ఫెయిర్‌గా రికార్డు
- వివరాలు వెల్లడించిన అధ్యక్షుడు డా.యాకూబ్
పంజాగుట్ట, వెలుగు: డిజిటలీకరణ అత్యంత వేగంగా జరుగుతున్న తరుణంలోనూ యువత బుక్‌ఫెయిర్ పట్ల ఆసక్తి చూపడం స్ఫూర్తిదాయకమని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు డా. యాకూబ్ అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో 38వ బుక్ ఫెయిర్ నిర్వహణ తీరును ఆయన వివరించారు. పుస్తకాలను హస్తభూషణంగా భావించి బుక్ ఫెయిర్‌కు ఈసారి పెద్దసంఖ్యలో యువత తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ వారసత్వానికి అద్దం పట్టేలా బుక్ ఫెయిర్ ప్రాంగణానికి దివంగత ఉద్యమకారుడు అందెశ్రీ పేరు పెట్టి నివాళులర్పించామన్నారు.11 రోజుల పాటు కొనసాగిన ఈ బుక్ ఫెయిర్లో 8 కోట్లకు పైగా పుస్తకాలు అమ్ముడయ్యాయని, ఈ ఫెయిర్ దేశంలోనే మూడో అతిపెద్ద బుక్ ఫెయిర్‌గా రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు.
స్టాల్ అద్దెలు, ప్రవేశ రుసుములు, స్పాన్సర్ షిప్ ద్వారా బుక్ ఫెయిర్ కు రూ.1.57 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. సమావేశంలో సెక్రటరీ ఆర్. శ్రీనివాస్ (వాసు), ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి తదితర నిర్వాహకులు పాల్గొన్నారు.
