హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధనమదంతో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. ఈ మేరకు మంగళవారం బీర్ల అయిలయ్య హైదరాబాద్‌లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ శిక్షణ శిబిరం నిర్వహించడం సంతోషమేనని, అయితే అది సమావేశాలు సజావుగా సాగేందుకు అయితే బాగుండేదని అన్నారు.
కానీ, ఈ అసెంబ్లీ సమావేశాలను ఎలా అడ్డుకోవాలనే దానిపైనే శిక్షణ ఇచ్చినట్టు కేటీఆర్ మాటల తీరును చూస్తే అర్థం అవుతుందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడ్తామని కేటీఆర్ ఎలా మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఈ అడ్డగోలు మాటలు మాట్లాడడం ఆపి, బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను తీసుకురావాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతను ఫామ్‌హౌస్‌లో పడుకోబెట్టి కేటీఆర్, హరీశ్‌లు ఈ ప్రభుత్వంపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
