మళ్లీ ప్రమాదకర స్థాయిలో వరద.. ఉస్మాన్సాగర్ 8 గేట్లు, హిమాయత్ సాగర్ 2 గేట్లు ఓపెన్

మళ్లీ ప్రమాదకర స్థాయిలో వరద.. ఉస్మాన్సాగర్ 8 గేట్లు, హిమాయత్ సాగర్ 2 గేట్లు ఓపెన్
  • మూసీలోకి 4,800 క్యూసెక్కుల నీరు
  • పరివాహక ప్రాంతాలను అలర్ట్​చేసిన వాటర్ బోర్డు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సిటీ జంట జలాశయాల్లోకి మరోసారి ప్రమాదకర స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన వాటర్ బోర్డు అధికారులు.. వచ్చిన నీటిని వచ్చినట్టుగా నేరుగా దిగువన మూసీలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుతం మూసీలోకి 4,800 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. 

ఉస్మాన్​సాగర్‌‌‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.15 అడుగుల నిల్వ ఉంది.  ఫలితంగా ఈ జలాశయం 8 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. ఇన్​ఫ్లో 1,900 క్యూసెక్కులు ఉండగా, ఔవుట్‌‌‌‌ ఫ్లో 2,704 క్యూసెక్కులుగా ఉంది.  

అలాగే హిమాయత్ సాగర్ 2 గేట్లను అధికారులు ఎత్తారు. ఈ జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.90 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 1200 క్యూస్సెక్కులు కాగా ఔట్ ఫ్లో 2000  క్యూసెక్కులుగా కొనసాగుతోంది.