- 2014 లో 24.85 లక్షలు.. ప్రస్తుతం 16.51 లక్షలే..
- గవర్నమెంట్, లోకల్‌బాడీ స్కూళ్లలో
- ఏటా పడిపోతున్న అడ్మిషన్లు
- కరోనా టైంలో వచ్చిన మూడున్నర
- లక్షల మందీ వాపస్
- యూడైస్ లెక్కల్లో వెల్లడి..అడ్మిషన్ల పెంపుపై దృష్టి పెట్టని విద్యాశాఖ ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడులు కళ తప్పుతున్నాయి. పదేండ్ల కింద కిటకిటలాడిన క్లాస్ రూమ్‌లు.. ఇప్పుడు స్టూడెంట్లు లేక బోసిపోతున్నాయి. 2014–15లో గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లలో 24.85 లక్షల మంది పిల్లలు ఉంటే.. 2025–26 నాటికి ఆ సంఖ్య 16.51 లక్షలకు తగ్గిపోయింది. పదేండ్లలోనే ఏకంగా 8 లక్షల మంది విద్యార్థులు సర్కారు బడికి దూరమయ్యారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోపక్క.. ప్రైవేటు బడుల్లో మాత్రం అడ్మిషన్లు పెరిగిపోతున్నాయి. సర్కారు బడుల్లో వసతులతోపాటు స్టూడెంట్లకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్ అందజేస్తున్నా, అధికారుల నిర్లక్ష్యంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏటా లక్ష మంది ఔట్
రాష్ట్రవ్యాప్తంగా 2014 –15 విద్యాసంవత్సరంలో 26,114 ప్రభుత్వ, లోకల్‌బాడీ స్కూళ్లు ఉండగా, వాటిలో 24,85,007 మంది విద్యార్థులు చదువుకునేవారు. కానీ, 2025–26 విద్యా సంవత్సరం నాటికి ఈ సంఖ్య 16.51 లక్షలకు తగ్గిపోయింది. గడిచిన పదేండ్లలో ఏకంగా 8.34 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. సగటున ఏటా లక్ష మందికి పైగా విద్యార్థులు సర్కారు బడిని వదిలి వెళ్తున్నారు. అయినా, అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. మరోపక్క సర్కారు బడులపై నమ్మకం లేకపోవడం, ఇంగ్లిష్ మీడియంపై మోజుతోనే ఈ సమస్య ఏర్పడిందని విద్యావేత్తలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దశలవారీగా స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడ్తున్నప్పటికీ సబ్జెక్ట్ బోధించే టీచర్లను సరిపడా నియమించకపోవడం సమస్యగా మారింది. ఇక సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ఉండడం, ఎల్‌కేజీ నుంచే పిల్లలను ప్రైవేట్‌స్కూళ్లకు పంపుతుండడం అక్కడి నుంచి ఇక్కడికి పిల్లలను ఇక్కడికి తరలించడం సమస్యగా మారిందని టీచర్లు చెప్తున్నారు.
కరోనా టైమ్‌లో అడ్మిషన్లు పెరిగినా..
కరోనా కష్టకాలంలో 2021–22 విద్యాసంవత్సరంలో ప్రైవేటు ఫీజులు కట్టలేక చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించారు. 2020–21లో 19.73 లక్షల మంది ఉంటే.. కొవిడ్ సమయంలో పెరిగిన అడ్మిషన్ల కారణంగా 2021– 22 లో ఏకంగా 23.25 లక్షలకు చేరారు. ఆ ఒక్క ఏడాదే అడ్మిషన్లు 17.85% పెరిగాయి. దీంతో సర్కారు బడులకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అంతా భావించారు. కానీ, అప్పటి బీఆర్ఎస్ సర్కారు తీరుతో ఆశ అడియాశే అయింది. కొవిడ్ టైమ్‌లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా కనీసం విద్యావలంటీర్లనూ అప్పటి ప్రభుత్వం నియమించలేదు. దీంతో టీచర్లు లేని బడుల్లో తమ పిల్లలు కొనసాగించలేక పేరెంట్స్ అడ్మిషన్లు క్యాన్సిల్ చేసుకున్నారు. మరుసటి ఏడాదే అంటే 2022–23లో విద్యార్థుల సంఖ్య 20.48 లక్షలకు పడిపోయింది. ఏకంగా 11.92 శాతం మంది పిల్లలు డ్రాప్ అయ్యారు. 2023–24లో మరో 11.81 శాతం, 2024–25లో 9.07 శాతం మేర ఎన్‌రోల్‌మెంట్ పడిపోయింది.
ప్రైవేటు వైపే చూపు..
ఓ వైపు ప్రభుత్వ బడులు ఏటేటా ఖాళీ అవుతుంటే.. ప్రైవేటు స్కూళ్లు మాత్రం కళకళలాడుతున్నాయి. 2014–15 లో 10 వేల బడుల్లో 28,96,179 మంది విద్యార్థులు చదివితే, ఆ సంఖ్య 2024–25లో 36,82,873 మందికి పెరిగింది. ఈ ఏడాది 2025–26లో 37.36 లక్షలకు చేరింది. పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అప్పులు చేసైనా సరే తమ పిల్లలను ప్రైవేటు బడులకే పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. సరైన వసతులు లేకపోయినా..వేలు, లక్షల్లో ఫీజులు కడుతూ ప్రైవేటు బడుల్లో చదివించేందుకు పేరెంట్స్ మొగ్గుచూపుతుండడం గమనార్హం. ప్రభుత్వ చదువులపై విశ్వాసం లేకపోవడమే ఇందుకు కారణమని విద్యావేత్తలు చెప్తున్నారు.
మీటింగులెక్కువ.. పాఠాలు తక్కువ..
సర్కారు బడుల్లో టీచర్ల సంఖ్య భారీగానే ఉన్నా.. వారికి బోధన పనుల కంటే బోధనేతర పనులే ఎక్కువగా చెప్తున్నారని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. టీచర్లను రోజుల తరబడి శిక్షణ తరగతులు, వివిధ మీటింగుల పేరిట ఎంగేజ్చేస్తున్నారు. దీనికి తోడు ఎన్నికలు, ఇతర విధులు సరేసరి. మరోవైపు విద్యాశాఖలో డిప్యూటేషన్ల దందా తీవ్రంగా ఉంది. లక్షలు పెట్టి, పైరవీలు చేసుకొని మరీ పట్టణాలు, మండల కేంద్రాలకు డిప్యూటేషన్‌పై వస్తున్న టీచర్ల సంఖ్య పెరుగుతున్నది. దీంతో పిల్లలున్న దగ్గర టీచర్లు ఉండటం లేదు. టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు ఉండటం లేదు. వారిని రేషనలైజేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల సంఖ్యకు సంబంధించి సర్కారుకు తప్పుడు నివేదికలూ ఇస్తున్నారనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.
ఇదంతా ఆఫీసర్ల తప్పే
సర్కారుకు వాస్తవ పరిస్థితులు చెప్పడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు. అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రైవేటు బడుల్లో రెండున్నర, మూడేండ్లకు నర్సరీ అడ్మిషన్లు ఇస్తే.. సర్కారులో మాత్రం ఐదేండ్లకు డైరెక్ట్ ఒకటో తరగతిలో ఇస్తున్నారు. ముందే పేరెంట్స్ అక్కడ చేర్పించాక ఇక్కడికి ఎలా వస్తారు? ఈ ఏడాది వెయ్యి బడుల్లోనే ప్రీప్రైమరీ పెట్టారు. కానీ, సిలబస్ లేదు వారికి టీచర్లు లేరు. కనీసం వచ్చే ఏడాదైనా అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం పెట్టాలి. పేరెంట్స్ ఆలోచనలను టీచర్ల సంఘాలు అధికారులకు చెప్తున్నా.. పట్టించుకోవడం లేదు.
- పింగిలి శ్రీపాల్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ
టీచర్లను క్లాసురూములకే పరిమితం చేయాలి
సర్కారు బడుల్లో టీచర్లను తరగతి గదులకే పరిమితం చేయాలి. అలా కాకుండా ఇతర పనులు చేయిస్తున్నారు. దీంతో క్లాసులు సరిగా జరగడం లేదు. స్కూళ్లను ప్రైవేటు బడులకు దీటుగా అభివృద్ధి చేస్తే.. విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సర్కారు స్కూళ్లపై పేరెంట్స్‌కు అవగాహన కల్పించడంలో విద్యాశాఖ అధికారులు విఫలమమయ్యారు. క్లాసు రూముకొక టీచర్ తప్పకుండా ఉండేలా చూడాలి. సర్కారు బడుల బలోపేతం, అడ్మిషన్ల పెంపులో ప్రజాప్రతినిధులనూ భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. - చకినాల అనిల్ కుమార్, టీపీటీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్
