సిక్స్‌కు 6 పరుగులు సరిపోవు.. 8, 10 పరుగులు ఇవ్వాలి: రోహిత్ శర్మ

సిక్స్‌కు 6 పరుగులు సరిపోవు.. 8, 10 పరుగులు ఇవ్వాలి: రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతటి బలశాలియో అందరికీ విదితమే. క్రీజులో కుదురుకునేందుకు సమయం పట్టాచ్చేమో కానీ, ఆ తరువాత మాత్రం బౌలర్లకు పీడకలే. అలవోకగా సిక్సులు బాదేస్తుంటాడు. అంతటి సామర్థ్యం రోహిత్ వశం. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ అదే జారు కనపరిచాడు. మూడో వన్డేలో 6 సిక్సులు బాదాడు. ఈ క్రమంలో రోహిత్.. సిక్సులు కొట్టేవారికి న్యాయం జరిగేలా ఒక కొత్త రూల్ తెరమీదకు తెచ్చాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్‌కు క్రికెట్‌ను మరింత ఆసక్తిగా మార్చడానికి ఒక్క రూల్ కావాలంటే ఏం చేస్తావు? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులిచ్చిన హిట్ మ్యాన్.. దూరాన్ని బట్టి సిక్సుకు పరుగులిచ్చేలా ఒక కొత్త రూల్ ప్రతిపాదించాడు. అదెలా అంటే.. 90 మీటర్లు వెళ్లిన సిక్సర్‌కు 8 పరుగులు,100 మీటర్లు వెళ్లిన సిక్సర్‌కు 10 పరుగులు ఇవ్వాలట. ఇలా చేస్తేనే భారీ సిక్సర్లు కొట్టిన వారికి న్యాయం జరుగుతుందట. 

"సిక్స్ అనగానే ఆరు పరుగులే ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. 90 మీటర్ల సిక్స్‌కు 8 పరుగులివ్వాలి. అదే 100 మీటర్ల సిక్స్ అయితే 10 పరుగులు ఇవ్వాలి. అంత దూరం వెళ్లే సిక్సులు కొట్టి అభిమానులను అలరించినందుకు వారికి ఏదో ఒక బహుమతి ఉండాలి కదా. క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్ వంటి ప్లేయర్లు చాలా ఈజీగా 100 మీటర్ల సిక్సర్లు బాదేస్తారు. అది వెళ్లి బౌండరీ లైన్ అవతల పడుతుంది. అయినా కూడా కూడా ఆరు పరుగులే వస్తున్నాయి. ఇది గేల్, పొలార్డ్ వంటి వాళ్లకు అన్యాయం కదా!.." అంటూ హిట్ మ్యాన్ అని తన అసహనాన్ని వెల్లడించాడు.

రెండో స్థానంలో రోహిత్ 

ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్లలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ బాస్ క్రిస్ గేల్ (553) తొలి స్థానంలో ఉన్నాడు.