షాకింగ్.. తండ్రి వర్థంతికి నాగపూర్ వచ్చిన టెక్కీ.. అమెరికా తిరిగెళ్లటానికి రూ.7లక్షలు ఖర్చు

షాకింగ్.. తండ్రి వర్థంతికి నాగపూర్ వచ్చిన టెక్కీ.. అమెరికా తిరిగెళ్లటానికి రూ.7లక్షలు ఖర్చు

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న H-1B వీసా రుసుము ఏకంగా లక్ష డాలర్లకు పెంచే చర్య భారతీయ ఐటీ నిపుణులతో పాటు ఎన్ఆర్ఐలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ వీసా కార్యక్రమం ద్వారా అమెరికాలో పనిచేసే భారతీయ నిపుణుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో.. కొత్త ఫీజు కారణంగా చాలా మందికి ఉద్యోగ భవితవ్యంపై ఆర్థిక భయం ఏర్పడింది. అలాగే దసరా, దీపావళి లేదా ఏదైనా ఫంక్షన్ కోసం ఇండియా రావాలని ప్లాన్ చేసుకున్న వేల మంది ఎన్ఆర్ఐలు ప్రస్తుతం భయాందోళనలకు గురవుతున్నారు. చాలా మంది దారిమధ్య నుంచే జర్నీ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి తిరిగి వెళుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరు తన తండ్రి వర్ధంతి సందర్బంగా అమెరికా నుంచి నాగపూర్ వచ్చాడు. హెచ్1బి వీసాల విషయంలో అనుమానాలు, భయాలతో కంపెనీలు కూడా తమ ఉద్యోగులను అత్యవసరంగా అమెరికా తిరిగి రావాలని సూచించాయి. దీంతో అత్యవసర విమాన టికెట్ల కోసం 8వేల డాలర్లు అంటే జస్ట్ రిటర్న్ జర్నీ కోసం భారత కరెన్సీలో రూ.7 లక్షల వరకు ఖర్చు చేశాడు సదరు టెక్కీ. తాను 11 సంవత్సరాలుగా అమెరికాలో కుటుంబంతో గడిపిన తర్వాత భవిష్యత్తుపై నీలినీడలు అలుముకోవటం బాధాకరంగా ఉందని వాపోయాడు. తన కుమార్తె పూర్తి జీవితం అమెరికాలోనే గడిపిందని ఇండియాకు తిరిగివెళ్లాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటని బాధపడ్డాడు.

ALSO READ : రూ.53వేల శాలరీతో స్టార్ట్ అయిన జర్నీ.. 9 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టిన ఉద్యోగి..

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుండి విడుదలైన అస్పష్టమైన సంకేతాల కారణంగా.. ప్రస్తుతం ఉన్న H-1B వీసా హోల్డర్లు భయంగా అమెరికా వెళ్లి తిరిగి వెల్లడం పెరిగింది. తాజాగా రూల్స్ పై క్లారిటీతో కేవలం కొత్త అప్లికేషన్ దారులు మాత్రమే ఈ భారీ ఫీజు చెల్లించాలని తెలియటంతో కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు ఎన్ఆర్ఐ టెక్కీలు.

హెచ్1బి వీసా భారీ రుసుము పెంపు భారతీయ ఐటీ సెక్టార్ స్టాక్స్‌ను కూడా ప్రభావితం చేసింది. Infosys, Wipro, TCS వంటి పెద్ద సంస్థల షేర్ల విలువలు కుప్పకూలుతున్నాయని వ్యాపార విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధానం యునైటెడ్ స్టేట్స్‌లో భారతీయ నిపుణుల పనిభారం తగ్గించి, స్థానికంగా అమెరికా కార్మికులను నియమించుకునే దిశగా పరిస్థితులు మారొచ్చనే అంచనాలు ఉన్నాయి.