హుజూరాబాద్​ సీఎం సభకు 825 బస్సులు 

హుజూరాబాద్​ సీఎం సభకు  825 బస్సులు 
  • హుజూరాబాద్​లో సీఎం సభకు భారీ ఏర్పాట్లు
  • 20 ఎకరాల్లో 45 వేల మంది కూర్చునేలా కుర్చీలు
  • ప్రజలను తరలించడానికి 825 బస్సులు 
  • ప్రతి బస్సుకు ఒక అధికారి నియామకం

కరీంనగర్‍, వెలుగు: కరీంనగర్‍ జిల్లా హుజూరాబాద్‍ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం ప్రారంభించనున్న దళితబంధు కార్యక్రమానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హజూరాబాద్‍ నుంచి జమ్మికుంట వెళ్లే రోడ్డులో శాలపల్లి ఇందిరానగర్‍ వద్ద సుమారు 20 ఎకరాల్లో సభా స్థలంతోపాటుగా సుమారు 45 వేల మంది కూర్చునేలా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‍కు చెందిన కాంట్రాక్టర్‍ ఈ పనులను దక్కించుకున్నారు. నాందేడ్‍ నుంచి వచ్చిన కూలీలు నాలుగు రోజులుగా సభా ప్రాంగణం పనుల్లో నిమగ్నం అయ్యారు. 
భారీ జన సమీకరణకు ఏర్పాట్లు
హుజూరాబాద్‍ నియోజకవర్గంలో నిర్వహించనున్న దళితబంధు ప్రారంభోత్సవ సభకు ఎక్కువ సంఖ్యలో ప్రజలను తరలించడానికి నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. హుజూరాబాద్‍ నియోజకవర్గంలోనే 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. వీరితోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాలను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనం ఎక్కువగా కనిపించడానికి పార్టీ శ్రేణులను కూడా గ్రామాల నుంచి తరలించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 825 బస్సులు ఏర్పాటు చేశారు. సుమారు 40 వేల మందిని సభా ప్రాంగణానికి తీసుకురావాలన్నది నాయకులు ఆలోచన. వీరందరిని తీసుకురావడానికి ప్రతి బస్సుకు ఒక అధికారిని నియమించారు. సభకు 1.2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నా సభా విస్తీర్ణం, అక్కడి  ఏర్పాట్లు 50 వేలకు మించేలా కనిపించడం లేదు. నిర్మాణ పనులను ఆర్‍అండ్‍బీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.