త్రిపురలో స్టూడెంట్లకు హెచ్​ఐవీ

త్రిపురలో స్టూడెంట్లకు హెచ్​ఐవీ

47 మంది మృతి..ఏకంగా 828 మందికి పాజిటివ్
220 స్కూళ్లు, 24 కాలేజీల్లో బాధితుల గుర్తింపు
డ్రగ్స్ ఇంజక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజూ ఐదారు కొత్త కేసులు

అగర్తల: త్రిపురలో హెచ్ఐవీ కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలలో చదువుకుంటున్న యువత హెచ్ఐవీ బాధితులుగా తేలుతుండడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర నలుమూలలా రోజుకు ఐదు నుంచి ఏడు హెచ్ఐవీ కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెప్పారు. ఇటీవల ఏకంగా 47 మంది ఎయిడ్స్​తో చనిపోగా ప్రస్తుతం 828 మంది వైరస్ బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 572 మంది అడ్రస్ ట్రేస్ చేశామని, మిగతా వాళ్లు పై చదువుల కోసం వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లారని చెప్పారు. ఈమేరకు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ఏసీఎస్) రిపోర్టులు ఈ వివరాలను వెల్లడించాయి.

డ్రగ్స్ వాడకం వల్లే వ్యాప్తి..

రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోవడమే తాజా ఉపద్రవానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ తీసుకునేందుకు వాడే సిరంజీలతో హెచ్ఐవీ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని చెప్పారు. ఇటీవల త్రిపుర జర్నలిస్ట్ యూనియన్, వెబ్ మీడియా ఫోరం, టీఎస్ఏసీఎస్​ ఏర్పాటు చేసిన మీడియా వర్క్​షాపులో హెచ్ఐవీ కేసుల వ్యాప్తిపై చర్చ జరిగింది. రాష్ట్రంలోని 220 స్కూళ్లు, 24 కాలేజీల్లో హెచ్ఐవీ బాధిత విద్యార్థులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 164 హెల్త్ కేర్ హబ్స్ లలో యాంటీరిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) కోసం నమోదు చేసుకుంటున్న వారి గణాంకాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని చెప్పారు. 2024 మే నాటికి 8,729 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని వివరించారు. హెచ్ఐవీ బారిన పడుతున్న విద్యార్థులలో చాలావరకు డ్రగ్ బాధితులే ఉన్నారని చెప్పారు.